బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఆ ఇద్దరు పాలమూరు నేతలు

చాలా మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా అది. ఒకే పార్టీలో ఉన్న ఆ నేతలిద్దరూ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో పదవులు వెలగబెట్టి.. ఇప్పుడున్న పార్టీలోకి వచ్చిన వారే.

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 07:22 AM IST
బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఆ ఇద్దరు పాలమూరు నేతలు

Updated On : March 7, 2020 / 7:22 AM IST

చాలా మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా అది. ఒకే పార్టీలో ఉన్న ఆ నేతలిద్దరూ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో పదవులు వెలగబెట్టి.. ఇప్పుడున్న పార్టీలోకి వచ్చిన వారే.

చాలా మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా అది. ఒకే పార్టీలో ఉన్న ఆ నేతలిద్దరూ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో పదవులు వెలగబెట్టి.. ఇప్పుడున్న పార్టీలోకి వచ్చిన వారే. సడన్‌గా వారిద్దరినీ ఓ పెద్ద పదవి ఆశపెడుతోంది. ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచన వచ్చింది. తమకున్న సీనియారిటీని, అనుభవాన్ని ఉపయోగించుకొని ఎలాగైనా పోస్టు పట్టేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోనే ఉంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయా? లేక ఇద్దరినీ కాదని వేరే వారిని ఆ పదవి వరిస్తుందా?

అరుణ, జితేందర్ పోటీ:
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది రాష్ట్ర స్థాయి ఉద్దండులున్న జిల్లాగా పేరుంది. అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి రేసులో జిల్లా నుంచి డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి పోటీ పడుతున్నారట. నిన్న మొన్నటి వరకు వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో కీలక పదవుల్లో ఉండేవారు. ఈ మధ్య కాలంలోనే బీజేపీలో చేరారు. ఒకరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరొకరు టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ రాష్ట్ర పదవి కోసం పోటీ పడుతున్నారట.

అధ్యక్ష పదవి రేసులో ఫైర్ బ్రాండ్:
కాంగ్రెస్‌లో మంత్రిగా పని చేసి, ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన డీకే అరుణ.. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత తనదైన శైలిలో మున్సిపల్ ఎన్నికల్లో, సహకార ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న డీకే అరుణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారంటున్నారు. పార్టీ అధిష్టానం ఆమెకు అధ్యక్ష పదవి ఇస్తుందనే చర్చ ఉమ్మడి జిల్లాలో సాగుతోంది. ఈ విషయంలో అరుణ ఢిల్లీలో పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారట. అక్కడే మకాం వేసి అధ్యక్ష పదవి దక్కేలా పావులు కదుపుతున్నారట. 

తనకే పదవి దక్కుతుందని జితేందర్ ధీమా:
మరోవైపు టీఆర్ఎస్‌ తరఫున లోక్‌సభ టికెట్ ఆశించినా కేటాయించకపోవడంతో బీజేపీలో చేరారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఇప్పుడు ఆయన కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారట. గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలను ప్రస్తుతం పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. పైగా టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు పార్లమెంటు ఫ్లోర్ లీడర్‌గా పని చేసిన అనుభవం తనకు కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కచ్చితంగా తనకే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని అనుచరులతో చెప్పుకుంటున్నారట. 

సీఎం కేసీఆర్ తో సమానమట:
జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రేపో మాపో తాను రాష్ట్ర అధ్యక్ష పదవి అధిష్టిస్తే సీఎం కేసీఆర్‌తో సమానమని తన మనసులోని మాటను ఆయనే స్వయంగా ప్రకటించారట. ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నారంటున్నారు. మొత్తానికి ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు బీజేపీ రాష్ట్ర పదవి కోసం పోటీ పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ అధిష్టానం వీరిద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో? లేక మూడో వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెడుతుందో చూడాలి.

See Also | జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్