జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి

  • Published By: vamsi ,Published On : March 2, 2019 / 07:44 AM IST
జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి

Updated On : March 2, 2019 / 7:44 AM IST

జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్న రెండు నేషనల్ పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా హామీలను నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తానంటూ ఆయన స్పష్టం చేశారు. చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండాలనే ఉద్ధేశ్యంతోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇండియా కాంక్లేవ్ లో భాగంగా ముచ్చటించిన జగన్.. రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను జగన్ తెలియజేశారు. 

కష్టాల్లో ఉన్నవాళ్లకు భరోసా

ప్రజల ఆశలు, ఆశయాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేశానని, పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలో గడిపి ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అనేది తెలుసుకున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసాను ఇచ్చానని, ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యమని ఆయన అన్నారు.

తొమ్మిదేళ్లుగా ప్రజలతోనే

నా తొమ్మిదేళ్ల ప్రయాణంలో ఎక్కువ భాగం ప్రజలతోనే బ్రతికానని.. పాదయాత్రలో ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నానని, ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా ప్రజలతో మమేకమై వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువమంది ప్రజలు క్రెడిబిలిటీ ఉన్న ప్రభుత్వం లేదని భావిస్తున్నారని ఆయన అన్నారు.

రైతులను మోసం చేశారు

ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు కొందరు వ్యక్తులు సృష్టించినవని, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చలేదని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా చేస్తానని వాగ్దానం చేసి రైతులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఓ వర్గం వారికి మాత్రమే చంద్రబాబు ప్రయోజనం కల్పించారని అన్నారు.

నవరత్నాలతో మేలు చేస్తాం

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరికైనా పథకం అందించాలంటే నువ్వు ఏ పార్టీ అని అడిగే పరిస్థితి ఉందని, మేం అటువంటి పరిస్థితిని మార్చాలని అనుకుంటున్నాం అని, గ్రామ సెక్రటరేట్ పేరుతో కొత్త పాలనకు నాంది పలుకబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల పథకంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని అన్నారు.

ఆంధ్రను మోసం చేశారు

నేషనల్ పార్టీలు రెండూ ఆంధ్రను మోసం చేశాయి. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆంధ్రను విభజించారు. ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్ లో చెప్పి, విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. అందువల్ల యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదని, ఏపీలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లాలి అంటూ ప్రశ్నించారు. చదువుకున్నవాళ్లకు ఏ స్టేట్ కు వెళ్లాలనే విషయంలో క్లారిటీ లేకుండా పోయిందని అన్నారు. 

విడదీసేినప్పుడు వాళ్లకు తెలియదా?

ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని చెబుతున్న నేషనల్ పార్టీలకు విభజించిన సమయంలో వీటిపై అవగాహన లేదా? పార్లమెంట్ లో ఇచ్చిన మాటకే విలువ లేనపప్పుడు.. పార్లమెంటు మీద నమ్మకం ఎలా ఉంటుంది.? అని ప్రశ్నించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించినప్పుడు ప్రత్యేక​ హోదా ఎందుకు ఇవ్వరు? జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.

వెన్నుపోటు పొడిచారు

అన్యాయంగా ప్రజలు కోరుకునేదానికి భిన్నంగా ఏపీని కాంగ్రెస్‌ విభజిస్తే.. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మోసం చేశాడని, ఏపీ ప్రజలను కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలూ వెన్నుపోటు పొడిచాయన్నారు. రాహుల్ గాంధీ ఆయనకు ఆయనగా ప్రధాని అయితే తనకు ఇబ్బందేం లేదని, వచ్చే ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తేనే వారికి మద్దతు ఇస్తానంటూ ఆయన స్పష్టం చేశారు.