రిటైర్ అయినా.. లక్షల్లో జీతాలు, ఫారిన్ టూర్లు.. చిక్కుల్లో IAS అర్వింద్ కుమార్

మాజీమంత్రి కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖ‌లో చ‌క్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవ‌హారం న‌డిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

రిటైర్ అయినా.. లక్షల్లో జీతాలు, ఫారిన్ టూర్లు.. చిక్కుల్లో IAS అర్వింద్ కుమార్

IAS Arvind Kumar In Big Trouble

Updated On : January 20, 2024 / 10:28 PM IST

IAS Arvind Kumar : సీనియర్ IAS అర్వింద్ కుమార్ వ్యవహారంపై తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఫార్ములా ఈ-కారు అగ్రిమెంట్ గోల్‌మాల్‌లో అర్వింద్ కుమార్ చిక్కుకోగా.. రిటైరైన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకు చుట్టుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏకంగా 179 మందికి అర్వింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్లు లెక్క తేలింది. దీంతో అర్వింద్ అవకతవకలపై ఫుల్ ఫోకస్‌ చేసింది తెలంగాణ సర్కార్.

అర్వింద్ కుమార్‌పై ఫుల్‌ ఫోకస్‌..
సీఎం రేవంత్ రెడ్డి పరిపాల‌న‌లో ప‌ట్టు పెంచుకుంటూనే.. గత ప్రభుత్వంలో జ‌రిగిన అవ‌త‌క‌వ‌క‌ల‌ను వెలికి తీసే ప్రయ‌త్నం చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగ‌మైన మేడిగడ్డపై విజిలెన్స్‌ను రంగంలోకి దింపిన తెలంగాణ స‌ర్కార్.. తాజాగా మున్సిప‌ల్ అడ్మినిష్ట్రేష‌న్ శాఖ‌పై అందులోనూ అర్వింద్ కుమార్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది.

వారి కనుసన్నల్లో కోట్ల రూపాయల అవినీతి..
గ‌త ప్రభుత్వంలో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యద‌ర్శిగా, HMDA క‌మీష‌న‌ర్‌గా కీల‌క బాధ్యత‌లు నిర్వహించారు అర్వింద్ కుమార్. తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖల్లో రిటైరై, ఇంకా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల వివరాలు సేకరించడంతో.. ఈ వ్యవహారంలో కూడా అర్వింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Also Read : ఫార్ములా-ఈ రేసింగ్ గోల్‌మాల్‌పై రేవంత్‌రెడ్డి సర్కారు సీరియస్

అన్ని శాఖ‌ల్లో క‌లిపి 1,049 మంది రిటైరైన అధికారులు ఉంటే కేవలం అర్వింద్ కుమార్‌కు సంబంధించిన మున్సిపల్ శాఖలో ఏకంగా 179 మంది రిటైర్డ్ అధికారులు ఉద్యోగాల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు స‌ర్కార్‌కు లెక్క తేలింది. మున్సిపల్, HMDA అధికారిక కార్యకలాపాల్లో ప్రతి నిర్ణయం వెనుక వీరిదే కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. వీరి కనుసన్నల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది.

రిటైర్ అయిన ఉద్యోగులకు లక్షల్లో జీతాలు..
ఇక మున్సిపల్ శాఖ‌లో 179 మంది రిటైరైన అధికారుల నియామ‌కం కూడా అర్వింద్ కుమార్ ఆదేశాల మేరకే జరిగిందని సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖ‌లో చ‌క్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవ‌హారం న‌డిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గ్రూప్-1 ఆఫీసర్లు, IAS, IFS, కన్ఫర్డ్ IASల‌తో పాటు MRO, RDOలుగా రిటైరైన ఉద్యోగుల‌ను వివిధ హోదాల్లో నియ‌మించి.. వారికి నెల‌కు ల‌క్ష రూపాయ‌ల నుంచి రెండున్నర ల‌క్షల వ‌ర‌కు జీతభ‌త్యాల‌ను చెల్లించిన‌ట్లు ప్రభుత్వం గుర్తించింది.

ప్రజాధనంతో ఫారిన్ టూర్లు..
అంతేకాదు ఈ రిటైరైన అధికారులు తొమ్మిదిన్నర ఏళ్లల్లో విదేశీ టూర్లతో కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌ర్కార్ దృష్టికి వెళ్లింది. అర్వింద్ కుమార్ కీల‌క హోదాలో ఉంటూ ప్రజాధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డం.. ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌కు విరుద్దంగా రిటైర్డ్ అధికారులకు కీల‌క బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఆయన తీసుకున్న మిగిలిన నిర్ణయాలపై కూడా సర్కార్ తీగ లాగుతోంది.

చిక్కుల్లో కేటీఆర్..?
ఫార్ములా ఈ-కారు రేస్ అగ్రిమెంట్‌లో అర్వింద్ కుమార్ గోల్‌మాల్ చేశారని ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ప్రైవేట్ సంస్థకు విడుదల చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. దీనిపై చర్యలకు సిద్ధం అవుతోంది. అర్వింద్‌ కుమార్‌తో పాటు మాజీమంత్రి కేటీఆర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లీగల్ అడ్వైజ్ తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తంమ్మీద ఓవైపు ఫార్ములా ఈ-కారు రేస్‌ అగ్రిమెంట్‌.. మరోవైపు రిటైరైన అధికారుల నియామకం అర్వింద్‌ కుమార్‌కు ఇబ్బందికరంగా మారనుంది. మున్ముందు అర్వింద్ కుమార్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Also Read : సివిల్ సప్లయ్ అప్పులు రూ.58వేల కోట్లు- గత ప్రభుత్వంపై మంత్రుల సంచలన ఆరోపణలు