Hyderabad: ఫార్ములా-ఈ రేసింగ్ గోల్‌మాల్‌పై రేవంత్‌రెడ్డి సర్కారు సీరియస్

ఆ నిధులకు క్యాబినెట్ నుంచి గానీ, ఆర్థిక శాఖ నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.

Hyderabad: ఫార్ములా-ఈ రేసింగ్ గోల్‌మాల్‌పై రేవంత్‌రెడ్డి సర్కారు సీరియస్

Updated On : January 20, 2024 / 4:04 PM IST

Hyderabad e Prix: ఫార్ములా-ఈ రేసింగ్ గోల్‌మాల్‌పై సీరియస్‌గా ముందుకు వెళ్తోంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి విడుదల చేసిన.. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం.. డబ్బు రికవరీపై దృష్టి పెట్టింది. అర్వింద్‌కుమార్ ఇచ్చిన వివరణతో.. మాజీ మంత్రి కేటీఆర్‌ను కూడా బాధ్యుడిని చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న గ్రీన్‌కో కంపెనీ.. ఆ తర్వాత తప్పుకుంది. దీంతో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్.. FIA కంపెనీకి 55 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆ నిధులకు క్యాబినెట్ నుంచి గానీ, ఆర్థిక శాఖ నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.

షోకాజ్ నోటీసుకు అర్వింద్‌కుమార్ వివరణ
దీంతో సీఎస్ శాంతికుమారి ఇచ్చిన షోకాజ్ నోటీసుకు.. అర్వింద్‌కుమార్ వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను FIAకు నిధుల విడుదల నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ డీల్ వ్యవహారంలోకి మాజీ మంత్రి కేటీఆర్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కారు. ఈ గోల్‌మాల్ విషయంలో అర్వింద్‌కుమార్‌తో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: రిటైర్డ్ అధికారుల లెక్క తేలింది.. త్వరలోనే వారందరికీ..

అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా
ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరినట్లు సమాచారం. లీగల్ అడ్వైజ్ రాగానే.. అర్వింద్‌కుమార్‌తోపాటు కేటీఆర్‌పై క్రిమినల్ కేసులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ చెప్పినా అర్వింద్‌కుమార్ నిధులు విడుదల చేయడం చట్ట విరుద్ధమే అవుతుంది. అయితే.. కేటీఆర్ నిజంగానే మౌఖిక ఆదేశాలిచ్చారా ? లేకపోతే ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు అర్వింద్‌కుమార్ ఇలా చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.

Also Read: టీఎస్పీఎస్సీ కొత్త టీమ్‌ కోసం సర్కార్‌ కసరత్తు.. నిరుద్యోగుల కోసం.. ఏం జరుగుతుందో తెలుసా?

కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలపై ఉత్కంఠ
ఏదేమైనా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, అర్వింద్‌కుమార్ అవినీతిపై పలుమార్లు ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. ORR అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. తాజాగా.. ఈ ఫార్ములా రేస్ విషయంలో ఇద్దరి పేర్లూ తెరపైకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.