మండలి రద్దు కరెక్ట్ కాదు : జనసేనాని పవన్ కళ్యాణ్

  • Published By: chvmurthy ,Published On : January 27, 2020 / 02:11 PM IST
మండలి రద్దు కరెక్ట్ కాదు  : జనసేనాని పవన్ కళ్యాణ్

Updated On : January 27, 2020 / 2:11 PM IST

మండలి రద్దు సవ్యమైన చర్యకాదని జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు  పునురుధ్దరించిన మండలిని  ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కోంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూప కర్తలు ఎంతో ముందు చూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు.

ఏదైనా ఒక బిల్లుపై  శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేథోపరమైన మథనం చేసి వాటిని సరిదిద్దేందుకే మండలి రూప కల్పన చేశారని అన్నారు. ఇంతటి ఉన్నతాశయంతో  ఏర్పాటు చేసిన మండలిని… రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయడం సబబు కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

శాసన మండలి రద్దుకు ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని ప్రభుత్వం ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు మండలిలో నిలిచిపోతే దానిని రద్దు చేయడం సహేతుకంగా లేదన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయినట్లేనని పవన్ అన్నారు. శాసన మండలిని రద్దు చేసేంత పరిస్ధితులు రాష్ట్రంలో లేవని పవన్ కళ్యాణ్ అన్నారు.