పీవీకి భారతరత్న ఇవ్వాలి, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చర్చ నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. పీవీ అమలు చేసిన సంస్కరణల ఫలితాలనే ఇప్పుడు అనుభవిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు కేసీఆర్.
https://10tv.in/brits-ate-100000000-meals-during-eat-out-to-help-out/
ప్రధానిగా సేవలు అందించే అవకాశం కొద్దిమందికే ఉంటుంది:
సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉంది. ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. ఈ పదవి చాలా అరుదుగా దక్కుతుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది. పీవీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వాన్ని భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. పీవీ బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు. నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.
దేశ ఆర్థిక రథాన్ని ప్రగతి రథంలో పరుగులు పెట్టించారు:
భారత పూర్వ ప్రధాని పీవీ శత జయంతి చరిత్రలో విశిష్ట సందర్భంగా ఉండాలి. ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ స్మరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వ్యవస్థలో పురోగమించడానికి పీవీ కారణం. పీవీ మన ఠీవీ అని తెలంగాణ సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది. పీవీ ప్రధానిగా బాద్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో సతమతవుతోంది. దేశ ఆర్థిక రథాన్ని పీవీ ప్రగతి రథంలో పరుగులు పెట్టించారు అని కేసీఆర్ అన్నారు.
యుద్ధంలో గెలిచినవాడే చరిత్రను రాస్తారు:
పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో దీనిపై చర్చ సందర్భంగా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలన్నారు. యుద్ధంలో గెలిచినవాడే చరిత్రను రాస్తారని ఒక సామెత ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయిందన్నారు. పీవీ ఒక్కరే కాదు.. తెలంగాణకు సంబంధించిన ఎంతో మంది వైతాళికులు మరుగునపడ్డారని, వారిని గుర్తించి గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని కేటీఆర్ అన్నారు.
పీవీకి భారతరత్న, తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం:
మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ్యులందరూ ఈ తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం సభను బుధవారానికి(సెప్టెంబర్ 9,2020) వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ బుధవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. రేపట్నుంచి గంట పాటు ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కేవలం 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత జీరో అవర్ అర గంట పాటు కొనసాగనుంది. అనంతరం సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చట్టంపై సభలో చర్చ జరగనుంది.