కాంగ్రెస్‌కు మరో షాక్ : టీఆర్ఎస్‌లోకి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి

  • Published By: chvmurthy ,Published On : March 20, 2019 / 08:29 AM IST
కాంగ్రెస్‌కు మరో షాక్ : టీఆర్ఎస్‌లోకి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి

Updated On : March 20, 2019 / 8:29 AM IST

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరమ్ హర్షవర్ధన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. రేపో మాపో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం కన్ఫామ్ అయ్యింది. కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్దికి కేటీఆర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే హర్షవర్దన్ అన్నారు.

లోక్ సభ ఎన్నికల వేళ వలసలతో కాంగ్రెస్‌ విలవిలలాడుతోంది. ముఖ్యనాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే గులాబీ ఆకర్ష్‌తో డీలాపడ్డ హస్తం పార్టీ.. బీజేపీ ఆకర్ష్‌తో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. డీకే అరుణ నిష్క్రమణతో కాంగ్రెస్‌ నేతలు షాక్‌కు గురయ్యారు. దీంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో బుధవారం(మార్చి 20) మధ్యాహ్నం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.
Read Also :నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు.. రీజన్ ఇదే

నాయకులు పార్టీ వీడకుండా ఆపడం ఎలా అని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ సహా ఇప్పటివరకు 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారనే వార్తలు వస్తుండటంతో ఈ వలసలకు ఎలా చెక్ పెట్టాలా అని పార్టీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ వీడుతున్న నాయకులంతా రాష్ట్ర నాయకత్వం పై ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్ర పార్టీ నాయకత్వం కలుపుకు పోవటం లేదని, ఏకపక్షంగా వెళుతోందని, సమర్ధవంతంగా పని చెయ్యటం లేదు అనే ఆరోపణలు చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తల్లో భరోసా నింపటం లేదని, సీనియర్లను అగౌరవ పరుస్తున్నారంటూ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా, ఇంతవరకు ప్రకటించిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
Read Also :కేసీఆర్..దమ్ముందా : మేం పాండవులం గెలుపు కాంగ్రెస్ దే