తాండూరులో ఒంటరి ఎమ్మెల్యే.. పెత్తనమంతా వారిదే!

  • Published By: sreehari ,Published On : December 19, 2019 / 01:50 PM IST
తాండూరులో ఒంటరి ఎమ్మెల్యే.. పెత్తనమంతా వారిదే!

Updated On : December 19, 2019 / 1:50 PM IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తి రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య అగాధం నెలకొందంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా నియోజకవర్గంలో రాజకీయం చలాయించిన మహేందర్ రెడ్డి తన అనుచరులతో ప్రత్యేకంగా గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారని ఎమ్మెల్యే ఫీలవుతున్నారట.

తాండూరులో జరిగే రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు సమాచారం ఇస్తున్నారు. పార్టీ  నిర్ణయం మేరకు కాకుండా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పెత్తనం చలాయించడాన్ని ఎమ్మెల్యే వర్గం తప్పుబడుతోంది.

ఇతర నేతలదే నిర్ణయం :
నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం. కానీ  తాండూరులో మాత్రం ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పట్నం సునితా మహేదర్ రెడ్డి, పొరుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు అవసరమైనప్పుడు తమ అధికార దర్పాన్ని చూపుతుండడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు.

అధికారిక కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే ముహూర్తం ఖరారు చేస్తే వాటికి జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు కచ్చితంగా డుమ్మా కొడతారని కార్యకర్తలు అంటున్నారు. దీంతోపాటు తమ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదన్న విమర్శలు తెరపైకి తెస్తారట.

యువ ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు :
నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన రాజకీయ అనుభవం ఉపయోగించి ఇబ్బందులు పెట్టడం సహజంగా మారిందని ఎమ్మెల్యే వర్గం నేతలు వాపోతున్నారట. ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేగా అవకాశం దక్కడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆ ఎమ్మెల్సీకి ఉండడంతో యువ ఎమ్మెల్యేకు ఇబ్బందులు తప్పడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఎమ్మెల్సీకి తెరవెనుక మద్దతిస్తున్నారన్న ప్రచారం ఉంది.

గ్రూపు రాజకీయాలతో కేడర్ అయోమయం :
పార్టీలో ఇన్ని గ్రూపుల మధ్య ఎలా నెట్టుకు రావాలా అన్న చర్చ ఇప్పుడు కేడర్‌లో మొదలైందట. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేకే పూర్తి బాధ్యతలు అప్పగిస్తే…. సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

బలమైన నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర పావులు కదుపుతున్నారని జనాలు అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రం నియోజకవర్గాల్లో అధికారమంతా ఎమ్మెల్యేలదే అని చెబుతున్నారు. కానీ, హైదరాబాద్‌కు దగ్గరలోని రంగారెడ్డి జిల్లా తాండూరులో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులున్నాయని అంటున్నారు.