పవన్ పంచ్ : చంపేయండి, చింపేయండి అనలేదు

సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అధికారం కోసం ఆలోచించే చంద్రబాబు, జగన్‌కు ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. జగన్‌లా చంపేయండి, చింపేయండి అని తాను ఎప్పుడూ అనలేదన్నారు. ఎదుటి వారిని ప్రశ్నించాలంటే నైతిక బలం ఉండాలన్నారు. టీడీపీ నాయకులను తాను ఎన్నడూ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. జనసేన ఐడియాలజీకి అనుగుణంగా మాత్రమే మాట్లాడతానని చెప్పారు.
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ వ్యూహలు రచిస్తున్నారు. జిల్లాల వారిగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. తాజాగా కడప జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో పవన్ భేటీ అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. వ్యవస్థను బలపరచడానికి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప వ్యక్తిగా బలపడటానికి కాదని పవన్ స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు పవన్ సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారు. జనసేన సిద్దాంతాలను వారికి వివరిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ పిలుపునిస్తున్నారు. ఎదుటివారిపై వ్యక్తిగత, కులం ఆధారంగా విమర్శలు చేయొద్దని జనసైనికులకు సూచించారు. సమస్యలపైన మాత్రమే నిలదీయాలని చెప్పారు.