అంబులెన్సులు ఆరంభించడం అభినందనీయం…వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారు. అంబులెన్సులను ఆరంభించడం అభినందనీయమన్నారు. ఇక కరోనా టెస్టుల విషయంలో కూడా అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పని చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచానికే గడ్డు కాలమని.. ఎవరి జాగ్రత్తలో వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దామంటూ పవన్ పిలుపునిచ్చారు.
పవన్ మొదటిసారి ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 108 వాహనాల సర్వీసులు, రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న జాగ్రత్త చర్యలు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న టెస్టుల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలకు అభినందలు తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అంశానికి సంబంధించి పవన్ మొదటిసారి సానుకూలంగా స్పందించారు. ఎప్పటినుంచో కూడా అన్ని అంశాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు అంబులెన్సుల సర్వీసులు ప్రారంభించిన నేపథ్యం, కోవిడ్ నివారణకు తీసుకున్నటువంటి నియంత్రణ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న టెస్టుల నేపథ్యంలో పవన్ ప్రశంసలు జల్లు కురిపించారు. ముఖ్యంగా ఆంబులెన్సుల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి 1088 ఆంబులెన్సులను రెండు రోజుల క్రితం సీఎం జగన్ ప్రారంభించారు.
ప్రతి మండలానికి ఒక ఆంబులెన్స్ ఉండే విధంగా 108, 104 మండలానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఈ సర్వీసును వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఆంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం పట్ల సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.