గుంటూరు వస్తున్న మోడీ : సామాన్యుడి ప్రశ్నలు ఇవీ

  • Published By: madhu ,Published On : February 9, 2019 / 01:07 PM IST
గుంటూరు వస్తున్న మోడీ : సామాన్యుడి ప్రశ్నలు ఇవీ

గుంటూరు : ప్రధాని మోడీ ఆంద్రప్రదేశ్‌కు వస్తున్నారు. ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మరి ఇదే సమయంలో గతంలో కేంద్రం ఇచ్చిన హామీల మాటేంటి..? విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనులతో పాటు మిగతా పనులు కలిపి మొత్తం ఏపీకి 5 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. మోడీ వచ్చి మళ్లీ అదే చెబుతారా..? అసలు మోడీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఆంధప్రదేశ్ ప్రజలకు తీపి కబురందిస్తారా..? గతంలో ఈ పెద్దమనిషే ఇచ్చిన హామీల మేరకు ఏమైనా ప్రకటన చేస్తారా..? లేదంటే టీడీపీ సర్కార్‌, చంద్రబాబుపై విమర్శలకే పరిమితమవుతారా..? ఒక్కటి మాత్రం నిజం.. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన న్యాయ, అన్యాయాలపై టీడీపీ, బీజేపీ వాదన ఎలా ఉన్నా… ప్రధాని మోడీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు మాత్రం పది దాకా ఉన్నాయి. 

1 ) ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించారా..?  : – 
ఢిల్లీను తలదన్నే రాజధానిని నిర్మిస్తామని మోడీ తిరుపతి ప్రచార సభలో ప్రకటన చేశారు. నిజంగా అమరావతి ఢిల్లీని తలదన్నే రాజధానిగా మారిపోయిందా..? చెప్పిన మాటలేంటీ..? చేసిన చేతలేంటీ..? సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు అడుగుతున్న మొదటి ప్రశ్న ఇది. ఇప్పటివరకు కేంద్ర సర్కార్ రాజధాని నిర్మాణం కోసం ఇచ్చింది కేవలం 15 వందల కోట్ల రూపాయిలు మాత్రమే. 15 వందల కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించగలమా..? 1500 కోట్లే ఇచ్చి ఎలా చేతులు దులుపుకున్నారని.. సగటు పౌరుడు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయాలనుకుంటున్నాడు. 

2 ) మోడీ జీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తారా..? లేదా..? : –
ప్రత్యేక హోదా తాము డిమాండ్ చేయడం వల్లే వచ్చిందని అటు మ్యానిఫెస్టో నుంచి ప్రచార సభల వరకు ఊదరగొట్టారు బీజేపీ నేతలు. మరి దాని సంగతేంటీ..? ఏపీలో మెజార్టీ వర్గాలు హోదా అడుగుతున్నాయి కాబట్టి మీరిప్పుడు హోదా ప్రకటిస్తారా..?

3 ) పోలవరం నిర్మాణానికి నిధులెప్పుడిస్తారు..? అసలు నిర్మించే ఉద్దేశం ఉందా..? 
మూడో కీలకాంశం… ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. దీనికి జాతీయ హోదా ప్రకటించారు. కానీ ఆ స్థాయిలో నిధులు కూడా ఇవ్వాలి కదా.. 90 శాతం కాదు 100 శాతం ఖర్చు భరిస్తామన్నారు. పోలవరం నిర్మాణానికి ఐదారేళ్ల క్రితం ఉన్న అంచనా 16 వేల కోట్లు.. అదే అంచనాకి కట్టుబడుతామంటే ఎలా..? పోలవరం తాజా అంచనాలు ఆర్‌ఆర్ ప్యాకేజీతో కలుపుకొని 55 వేల కోట్లు..కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చునే పూర్తిగా చెల్లించకుండా..పాత అంచనాలు పేరుతో కాలయాపన చేస్తోంది నిజం కాదా..? 

4 ) అసలు రైల్వే జోన్ ఇచ్చే ఉద్దేశం ఉందా..? లేదా..? : – 
ఇక విశాఖ రైల్వే జోన్ విషయానికొస్తే.. అసలు రైల్వే జోన్ వస్తుందా..? లేదా..? ఆ మధ్యన ఇదిగో వచ్చేస్తోందని ప్రకటన చేశారు. జోన్ వస్తే ఏపీలో రైల్వేల అభివృద్ధితోపాటు ఉపాధి కల్పన జరుగుతుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు..ఆ ఆశలు అడియాశలేనా..? 

5 ) వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు..? : – 
రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాలకు ఇస్తామన్న ప్యాకేజీ సంగతేంటి..? ఇప్పటికి ఒకసారి 350 కోట్లిచ్చారు.. మరోసారి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న 350 కోట్లతో పాటు ఈ ఏడాదివి 350 కోట్లు .. మొత్తం 700 కోట్లివ్వమని నీతి అయోగ్ సిఫార్సు చేస్తే… ఉలకరు పలకరేం..? 

6 ) కడప స్టీల్ ప్లాంట్ నిర్మించే ఉద్దేశం ఉందా..? లేదా..? 
కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయానికొస్తే.. విభజన చట్టం ప్రకారం 13వ షెడ్యూల్‌లో తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణాల ప్రస్తావన ఉంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తీరా రాష్ట్ర ప్రభుత్వం రవాణా, విద్యుత్, ఐరన్ ఓర్ సాధ్యాసాధ్యాలపై సానుకూల వివరాలతో ముందుకోస్తే.. మొఖం చాటేసిన మాట నిజం కాదా..? 

7 ) రెవిన్యూ లోటును ఎప్పటిలోగా భర్తీ చేస్తారు..? : –
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రెవిన్యూ లోటు భర్తీ అనేది మరో కీలకాంశం..రాష్ట్రం విడిపోయినప్పుడు 16 వేల 112 కోట్లు రెవిన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉంది. వేరే పథకాల ద్వారా రాష్ట్రానికి రెవిన్యూ లోటు కొంత పూరించామని.. ఇంకా ఇవ్వాల్సింది 4 వేల కోట్లు మాత్రమే అని చెప్పిన కేంద్రం.. ఇప్పటికీ రెవిన్యూ లోటును భర్తీ చేయకపోవడం అన్యాయం కాదా.? 

8 ) విద్యా సంస్థలకు నిర్మాణానికి నిధులు ఎప్పుడిస్తారు..? : –
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో పదకొండు విద్యా సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2 వేల 909 ఎకరాల భూమిని ఇచ్చింది. 131 కోట్లతో ప్రహారీ గోడలు నిర్మించింది. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు 3 వేల 500 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటే..కేంద్రం ఇచ్చింది రూ. 746 కోట్లు మాత్రమే. 

9 ) రామాయపట్నం పోర్టును ఎప్పటిలోగా నిర్మిస్తారు..? : – 
ఇక ఓడరేవు నిర్మాణానికొస్తే.. ఏపీకి మంజూరైన ఓడరేవును రామాయపట్నంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 8 వేల కోట్లు వ్యయమయ్యే పోర్టు నిర్మాణంలో రాష్ట్రం వాటా 26 శాతం ఉండటంతో ఆదాయం కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కానీ కేంద్రం మాత్రం దుగరాజపట్నంలోనే నిర్మిస్తామని చెబుతూ.. పోర్టు నిర్మాణ అనుమతులతోపాటు నిధుల కేటాయింపులో సవతితల్లి ప్రేమ కనబరుస్తున్న మాట వాస్తవం కాదా..? 

10 ) ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేస్తారా..? 
ఇవే కాదు.. 9,10వ షెడ్యూల్ ప్రకారం ఆస్తుల విభజనపై అనుకున్నంత స్థాయిలో కేంద్రం జోక్యం చేసుకోలేదు.. రాష్ట్రంలో నిర్మించిన జాతీయ రహదారుల్లో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలను కలుపుతున్నవే అధికం.. అలాంటప్పుడు కేవలం ఏపీకే ఏదో గొప్పగా చెశామని ఎలా చెబుతున్నారు..? విజయవాడ, విశాఖలో మెట్రో రైలు నిర్మాణంపై కేంద్రం కనబరుస్తున్న ఆసక్తి ఎంత..? దీని గురించేం చెబుతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు.. ప్రభుత్వం, పాలకులు శాశ్వతం కాదు. ఆవేదన, ఆవేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న పది ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెబుతారా..? మళ్లీ పాత పాటే పాడుతారా..? చూద్దాం.