మా దేశం వ్యవహారాల్లో మీ జోక్యం అక్కర్లేదు: కెనడా ప్రధానికి కేంద్రం సమాధానం

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో సహా పలువురు కెనడా నాయకులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రైతుల ప్రదర్శనలపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది కేంద్ర ప్రభుత్వం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ.. భారత్‌పై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు అనవసరం అని అన్నారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, భారత రైతుల గురించి కెనడాకు చెందిన కొందరు నాయకుల వ్యాఖ్యలను మేము విన్నాము. ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత సమస్యలకు సంబంధించిన విషయాల గురించి ప్రకటనలు అవసరం లేదని అన్నారు.
గురు నానక్ 551వ జయంతి సందర్భంగా, కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో సిక్కు సమాజంతో ప్రసంగిస్తూ.. భారతదేశంలో రైతుల ఆందోళనలు గురించి మాట్లాడారు. భారతదేశంలో పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కెనడా ఎల్లప్పుడూ శాంతియుత నిరసన హక్కులకు సపోర్ట్ చేస్తుందని, కెనడా ఎంపి బర్దీష్ చాగర్ నిర్వహించిన ఫేస్‌బుక్ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరై ట్రూడో కామెంట్ చేశారు. ఆయనతో పాటు కెనడా మంత్రులు నవదీప్ బెయిన్స్, హర్జిత్ సజ్జన్, సిక్కు సంఘం సభ్యులు ఉన్నారు.
రైతు ఉద్యమంపై కెనడా ప్రధాని వ్యక్తం చేసిన ఆందోళనకు ప్రతిస్పందనగా, రాజకీయ లాభాల కోసం ప్రజాస్వామ్య దేశంలోని దేశీయ సమస్యపై మాట్లాడకపోవడమే మంచిదని భారతదేశం సూచన చేసింది. భారత విదేశాంగ శాఖ దీనిని చట్టవిరుద్ధం, అవివేకమని అభివర్ణించింది. కెనడా రక్షణ మంత్రి హర్ జిత్ సింగ్ సజ్జన్ కూడా మరొక ప్రకటనలో ఇండియాలో రైతులు జరుపుతున్న ఆందోళనపై స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై ‘అమానుష చర్యలు’ ఆందోళన కలిగిస్తోందన్నారు. బ్రిటన్‌లోని కొంతమంది ఎంపీలు కూడా రైతుల నిరసనకు మద్దతు ప్రకటించారు.
ఇదే విషయమై బీజేపీని వ్యతిరేకిస్తున్న శివసేన కూడా తీవ్రంగా ధ్వజమెత్తింది. ఈ సమస్య భారత్ అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాల రాజకీయాలకు రైతుల ఉద్యమం మేతగా మారకూడదంటూ శివసేన నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల పట్ల భారత్ చూపించే మర్యాదను మీరు దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. కెనడా లాగా ఇతర దేశాలు కామెంట్స్ చేయకముందే ప్రధాని ఈ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.