వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాలేడు : ఉండవల్లి  జోస్యం

  • Published By: chvmurthy ,Published On : February 24, 2019 / 11:43 AM IST
వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాలేడు : ఉండవల్లి  జోస్యం

Updated On : February 24, 2019 / 11:43 AM IST

రాజమహేంద్రవరం: వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం క‌ష్ట‌మని మాజీ ఎంపీ  ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జ‌న‌చైత‌న్య వేదిక ఆధ్వర్యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఆదివారం నిర్వ‌హించిన సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడతూ దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ కి 150 స్థానాలు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేద‌న్నారు. అంతేగాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమ‌లు చేసేందుకు యూపీఏలోని మిగిలిన ప‌క్షాలు అంగీక‌రించే అవ‌కాశం లేద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. 

పోల‌వ‌రం ప్రాజెక్టు స్పిల్ వే ప‌క్క‌నే బీట‌లు రావ‌డం ప‌ట్ల  ఉండవల్లి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. డీఈ స్థాయి అదికారికి ఎస్ ఈ హోదా క‌ల్పించి పోల‌వ‌రం నిర్మిస్తున్నార‌ని ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. విలీన మండ‌లాలు త‌న వ‌ల్లే క‌లిపార‌ని చెబుతున్న చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా ఎందుకు సాధించ‌లేక‌పోయారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ స‌ద‌స్సులో పాల్గొన్న మాజీ సీఎస్ అజయ్ క‌ల్లం ఏపీ ప్ర‌భుత్వ ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అప్పులు తీవ్రంగా పెరిగిపోతున్నాయ‌ని, అభివృద్ధి ప్ర‌చారంలో త‌ప్ప వాస్త‌వంలో క‌నిపించ‌డం లేద‌న్నారు. వార‌స‌త్వ‌, సినిమా రాజ‌కీయాల‌తో పాటు అవినీతి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారింద‌న్నారు.