ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అరుదైన సీన్
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అరుదైన సీన్ కనిపించింది. ఉప్పునిప్పులా ఉండే వైఎస్ జగన్, అచ్చెన్నాయుడు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అరుదైన సీన్ కనిపించింది. ఉప్పునిప్పులా ఉండే వైఎస్ జగన్, అచ్చెన్నాయుడు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
ఏపీ అసెంబ్లీలో అరుదైన సీన్ కనిపించింది. ఉప్పునిప్పులా ఉండే వైఎస్ జగన్, అచ్చెన్నాయుడు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. యాక్సిడెంట్‌లో గాయపడ్డ అచ్చెన్నను… బీఏసీ సమావేశంలో జగన్ పరామర్శించారు. ఆయనకు తగిలిన గాయాల్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికార ప్రతిపక్షాల చర్యలతో వేడి పుట్టిస్తున్నాయి. ఇంత చలిలోనూ మాటల మంటలు చెలరేగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై అసెంబ్లీలో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. అనూహ్యంగా ఉప్పు నిప్పులుగా అసెంబ్లీలో చెలరేగిపోయే సీఎం జగన్… ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు మధ్య ఆప్యాయత వెల్లివిరియడం నేతలందరినీ ఆశ్చర్యపరిచింది.
బీఏసీ సమావేశానికి జగన్‌తో పాటు మంత్రులు, చీఫ్ విప్‌లు… ప్రతిపక్ష టీడీపీ నుంచి శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఇటీవలే యాక్సిడెంట్‌కు గురైన అచ్చెన్నాయుడి వద్దకు స్వయంగా వెళ్లిన సీఎం జగన్… ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చేతికి అయిన గాయం చూసి తగ్గిందా అని ఆప్యాయంగా పరామర్శించారు. సీఎం స్వయంగా వచ్చి అడగడంతో… అచ్చెన్నాయుడు కూడా యాక్సిడెంట్ గురించి వివరించారు.
ఈ క్రమంలోనే కలుగజేసుకున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… మీ గురించి మా సీఎం జగన్ ఎంత ప్రేమగా అడిగారో చూడండంటూ అచ్చెన్నను చూస్తూ అడిగారు. దీనికి అచ్చెన్న కూడా సమాధానమిచ్చారు. నాకు.. జగన్‌కు వ్యక్తిగతంగా ఏముంటుంది చెప్పండి.. మాది వేరే పార్టీ.. మీది వేరే పార్టీ అనే దూరం మినహా… కోపం ఏముంటుంది అని సమాధానమిచ్చారు అచ్చెన్నాయుడు.
అచ్చెన్నతో మాట్లాడిన తర్వాత… పక్కనే ఉన్న మంత్రి కన్నబాబును చూసిన సీఎం జగన్… చంద్రబాబు గారి హెరిటైజ్ షాపుల్లో కిలో ఉల్లిపాయలు ధర ఎంత అని ప్రశ్నించారు. దీంతో 180 రూపాయలు ఉంటాయి సార్.. కొన్నిసార్లు 200 రూపాయలకు కూడా అమ్మారని కన్నబాబు సమాధానం ఇచ్చారు. అందుకు స్పందించిన జగన్… అంత ధర ఉన్నాయా… మరి రైతు బజార్‌లో ఎంతకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
దీంతో కిలో 25 రూపాయలకు అమ్ముతున్నారు సార్ అని కన్నబాబు రిప్లై ఇచ్చారు. అందుకు జగన్… అలాగా అంత తక్కువ ధరకు అమ్ముతున్నారా? ఎవరు వాటిని ఇచ్చారంటూ ప్రశ్నించారు. అందుకు కన్నబాబు… ఎవరో ఇవ్వడమేంటి.. మీరే ఇస్తున్నారుగా అని సమాధానం చెప్పారు. దీనికి జగన్ అచ్చెన్నాయుడు వంక చూస్తూ… అవునా మనమే ఇస్తున్నామా ? మరి చంద్రబాబు గారి హెరిటేజ్‌లో అంత ధర ఉన్నాయ అని సెటైర్లు వేశారు. దీంతో బీఏసీ సమావేశంలో నవ్వులు వెల్లివిరిశాయి.