AP Assembly Speaker : స్పీకర్ సంచలన నిర్ణయం.. ఆ 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

సంపూర్ణమైన విచారణ అనంతరం న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Assembly Speaker : స్పీకర్ సంచలన నిర్ణయం.. ఆ 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

AP Assembly Speaker MLAs Disqualification

Updated On : February 26, 2024 / 11:14 PM IST

AP Assembly Speaker : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పార్టీని వీడిన ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీ ఇచ్చిన పిటిషన్ తో ఆ పార్టీని వీడిన మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ లపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న 8మంది పై (నలుగురు వైసీపీ రెబల్స్, నలుగురు టీడీపీ రెబల్స్) స్పీకర్ అనర్హత వేటు వేశారు. సంపూర్ణమైన విచారణ అనంతరం న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చాయి. ఇటీవలే అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణను ముగించారు. తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా.. సాధారణ ఎన్నికల్లో వారు పోటీ చేసే అంశంపై ఎటువంటి ఇబ్బందులు ఉండవని పరిశీలకులు చెబుతున్నారు. ఏదైనా క్రిమినల్ కేసుల్లో రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కేవలం పదవులు మాత్రమే కోల్పోతారు. ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం చాలా ఆలస్యంగా జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read : కొత్త టెన్షన్‌.. కన్ఫ్యూజన్‍లో సేనాని.. పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ