Chandrababu Naidu : అందుకే ఆనాడు వేంకటేశ్వరుడు నన్ను కాపాడాడు, కురుక్షేత్ర యుద్ధం మొదలైంది, ఎవరినీ వదలిపెట్టను
కోకాపేట భూములకు వచ్చిన ధరల తరహాలో ఇక్కడ కూడా చేద్దామని అనుకున్నా. నేను అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా.Chandrababu Naidu

Nara Chandrababu Naidu(Photo : Facebook)
Chandrababu Naidu Warns YSRCP : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా అవసరం ఇంకా ఉందని నాడు అలిపిరి దాడిలో వేంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు అని చంద్రబాబు అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతవరకు తననూ ఎవరూ అడ్డుకోలేదన్న చంద్రబాబు.. నిన్న అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తన పర్యటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో(Punganur) హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు, పోలీసులపై నిప్పులు చెరిగారు.
”ఫ్లెక్సీలపై సైకో అని పేరు తీయించారు. కానీ ప్రజల మదిలో అది తీయలేరు. అలా పదం తీయించడం కూడా సైకో లక్షణమే. కొందరు పోలీసులు కూడా సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ కోకాపేట భూములకు వచ్చిన ధరల తరహాలో ఇక్కడ కూడా చేద్దామని అనుకున్నా. నేను తెచ్చిన పరిశ్రమ నుంచి ఎమ్మెల్యే బియ్యపు మధు కమీషన్లు తెచ్చుకుంటున్నారు. తెలంగాణతో సమానంగా రాష్ట్రాన్ని తయారు చేయాలని అనుకున్నా. పుంగనూరులోకి నేను వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశాడు పుంగనూరు పుడింగి. వైఎస్ వివేకానంద లాగా గొడ్డలి వేటుకు చనిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నేను పుంగనూరులోకి వెళ్లానని డీఐజీ అంటున్నారు. ఆయనకు బుద్ది జ్ఞానం ఉందా?” అని చంద్రబాబు ధ్వజమెత్తారు.(Chandrababu Naidu)
”సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. నేను సైకిల్ స్పీడ్ పెంచితే ఈ బియ్యపు మధు నూకలు అవుతాడు. ఎవ్వరినీ వదిలిపెట్టను. ఆత్మరక్షణ కోసం ఇళ్లలో కర్రలు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన మందు తాగితే కిక్కుతో పాటు పిచ్చి కూడా ఎక్కుతుంది. మందుబాబుల రక్తం కూడా సీఎం తాగుతున్నారు. నేను అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా. ఎమ్మెల్యే బియ్యపు మధుకు అన్నింటా కమీషన్లు. చివరకు ఆలయంలోనూ కమీషన్లు. కాళహస్తిని కేక్ ముక్కలా కోసుకొని తింటున్నాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. శ్రీకాళహస్తి నుంచే ఇది ప్రారంభం” అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శుక్రవారం(ఆగస్టు 4) అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పోలీసులపైనా దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read..AP Volunteers: వలంటీర్ల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?
చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో నిన్న జరిగిన హింసాత్మక ఘటనలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేశాయి. వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. టీడీపీ నేతలే తమపై దాడులకు తెగబడ్డారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
పుంగనూరులో టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని, పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు. మతిభ్రమించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు తన కాన్వాయ్ లో రౌడీమూకలను, కర్రలను, రాళ్లను తెచ్చారని ఆరోపణలు గుప్పించారు. పోలీసులపై దాడి చేసిందే కాక రివర్స్ లో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే చంద్రబాబు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.