Kishan Reddy : అప్పటివరకు వెంటాడతాం- కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి వార్నింగ్

అనేక రకాల గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టింది. ప్రజలను వెన్నుపోటు పొడిచింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.

Kishan Reddy : అప్పటివరకు వెంటాడతాం- కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి వార్నింగ్

Kishan Reddy

Kishan Reddy : ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, వెంటాడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక హామీలు, గ్యారెంటీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ‘తెలంగాణ ప్రశ్నిస్తోంది’ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు. ప్రశ్నిస్తున్న తెలంగాణ పోస్టర్ ను ఆవిష్కరించారు.

”తెలంగాణ తల్లి పదేళ్ల పాటు బందీ అయింది. ఒక కుటుంబం చేతిలో అనేక రకాల అన్యాయాలకు గురైంది. ప్రజా ఉద్యమాలు, పోరాటాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ప్రజా సమస్యలను చెప్పే ధర్నాచౌక్ ను ఎత్తేసింది. అహంకారం, నియంతృత్వం, నిరంకుశత్వంతో కేసీఆర్ ఓడిపోయినా.. తెలంగాణ ప్రజలు గెలవలేదు. అనేక తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన గ్యారెంటీల అమలులో చేతులెత్తేసింది. డిక్లరేషన్లు, గ్యారెంటీలు, మేనిఫెస్టోల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది.

100 రోజులైనా ఇచ్చిన హామీల అమలును గాలికొదిలేసింది. మహిళలకు ప్రతినెలా రూ.2500 భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ మీనమేషాలు లెక్కిస్తోంది. రైతులకు 2లక్షల రుణమాఫీ అని గ్యారెంటీ ఇచ్చింది. ఈ హామీ గురించి ఇంతవరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామన్నారు. కానీ ఈ గ్యారెంటీ కూడా వందరోజులు గడుస్తున్నా అతీగతీ లేదు. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు పట్టించుకోలేదు. వరిపంట క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. దీని మీద సర్కార్ కు స్పష్టత లేదు. విద్యార్థులకు రూ.5లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్నారు. దీని సంగతేంటి? పెన్షనర్లను గాలికొదిలేశారు.

పాల ఉత్పత్తిదారులకు లీటర్ కు రూ.5 బోనస్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువత.. తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ను గద్దె దించేందుకు నిరంతర పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన గ్యారెంటీని విస్మరించింది. రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. వందరోజుల్లో వారికి వెన్నుపోటు పొడిచింది.

అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. మహిళలకు అనేక రకాల సహకారం అందిస్తామన్నారు. రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. వందరోజుల్లో రెండోదశ గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. గొర్రెలు ఎక్కడికి పోయాయో, ఆ హామీ ఎక్కడికి పోయిందో..అర్థం కావడం లేదు. రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని.. ఏ బస్తీకి వెళ్లినా అడుగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మోదీ రైస్ ఇస్తుంటే.. రేషన్ కార్డుల గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు బియ్యం రైతులకు అందకుండా అడ్డుపడుతోంది. 57 ఏళ్లు దాటిన వారందరికీ రూ.4వేల పిన్షన్ ఇస్తామన్నారు. అనేక రకాల గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టింది. ప్రజలను వెన్నుపోటు పొడిచింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఇవాళ్టి నుంచి ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో ఓ ఉద్యమాన్ని నడపాలని నిర్ణయించాం. న్యాయంగా గ్యారెంటీలు అమలు జరిగితే.. లబ్దిపొందే వారందరినీ కలిసి కార్యాచరణ ఉంటుంది. ళ్లతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నింపజేస్తాం. డిజిటల్ క్యాంపెయిన్ ఇవాళ్టి నుంచి మొదలుపెడతాం.

ముఖ్యమంత్రి వంద రోజుల పాలన మీద మీట్ ది ప్రెస్ నిర్వహించారు. కానీ ఈ సమావేశంలో గ్యారెంటీలను దాటవేశారు. ప్రశ్నలను దాటవేశారు. మేం గ్యారెంటీ ఇస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా వెంటాడుతాం. వదిలిపెట్టబోం. 75 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు చూస్తే.. వాళ్లు తెలంగాణకు ఏదో చేస్తారనే విశ్వాసం మాకు లేదు” అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు, వాళ్ళ పార్టీనే ఖాళీ అవుతోంది- మల్లు రవి