పార్టీలకు EVMల భయం : రంగంలో ప్రైవేటు సైన్యం

TDP, YSRCP పార్టీలకు EVMల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఓటర్లు తమవైపే ఉన్నారంటున్న రెండు పార్టీలు.. ఈవీఎంలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నాయి. కేంద్ర బలగాలతోపాటు.. ప్రత్యేక టీమ్‌లతో పహారా కాయబోతున్నాయి. ఈవీఎంల మొరాయింపు, ఘర్షణలు నడుమ ఈనెల 11న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలన్నీ కేంద్ర భద్రతా బలగాల రక్షణలో స్ట్రాంగ్‌రూంలకు చేరాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు నెల రోజుల సమయం ఉంది. దీనితో వాటి భద్రత వ్యవహారం ఈసీకి కత్తిమీద సాములా మారింది. స్టాంగ్‌రూమ్‌లో ఉన్న ఈవీఎంలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలతో పహారా కాయిస్తుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ఎన్నికల సంఘం కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తున్నా.. ఓటమి భయంతో ప్రత్యర్ధులు దేనికైనా తెగిస్తారని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈవీఎంల రక్షణకు తమ సైన్యాన్ని రంగంలోకి దింపుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పర్యవేక్షించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలు నియమిస్తోంది. కమిటీ సభ్యుల జాబితా సిద్ధం చేయాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జిల్లా నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. లోటస్‌పాండ్‌లో కోర్‌కమిటీ సభ్యులతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ కూడా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అటు టీడీపీ కూడా తమ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. మూడు షిష్టుల్లో స్ట్రాంగ్ రూంల వద్ద పహారా ఉండాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు.. ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోలింగ్ రోజు ఘర్షణలకు దిగిన వైసీపీ.. ఈవీఎంల విషయంలో కుట్రలకు పాల్పడే అవకాశముందంటూ.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఏది ఏమైనా ఓటమి భయంతో ప్రత్యర్ధులు ఈవీఎంలను ఏదైనా చేయొచ్చనే భావనలో టీడీపీ, వైసీపీ ఉన్నాయి. ఇందుకు ఆపార్టీల అధినేతలు చేస్తున్న ప్రకటనలు ఊతమిస్తున్నాయి.