అందుకే, జనసేనలో చేరుతున్నా- ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు
నేను ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారు అని బాలశౌరి వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై నాకు నమ్మకం ఉందన్నారు.
Vallabhaneni Balashowry : తాను జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆదివారం (ఫిబ్రవరి 4) జనసేనలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని బాలశౌరి తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుండి పోటీ చేసి గెలిచానని అన్నారు. బందర్ పోర్టు నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కేంద్ర నిధులు సీఎస్ ఆర్ ఫండ్స్ తీసుకొచ్చామన్నారు. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా జరగలేదన్నారు.
పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కల్యాణ్ తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని బాలశౌరి వెల్లడించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పవన్ కల్యాణ్ అభివృద్ది చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. చాలామంది నాతో జనసేనలో జాయిన్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పని చేస్తామన్నారు. నేను ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారు అని బాలశౌరి వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై నాకు నమ్మకం ఉందన్నారు.
వల్లభనేని బాలశౌరి గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చేశారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసేశారు. తన అనుచరులు, అభిమానులతో చర్చించాక జనసేనలో చేరాలని బాలశౌరి నిర్ణయించారు. బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అధికారిక ప్రకటన చేశారు.
జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్ బాలశౌరి క్రమశిక్షణ కలిగిన నేత. రాష్ట్రానికి మంచి చేసే ఎంపీగా బాలశౌరి ఉన్నారు. ఎంపీ జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. బాలశౌరిపై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలి.