వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు? అయోమయంలో కార్యకర్తలు

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు? అయోమయంలో కార్యకర్తలు

Who Is Mylavaram TDP Candidate

Vasantha Venkata Krishna Prasad Vs Devineni Uma Maheswara Rao : మైలవరం టీడీపీ టికెట్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. దేవినేని ఉమ, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్ లో టచ్ లోకి వెళ్లారు. అయితే, వసంత కృష్ణ ప్రసాద్ ఇంతవరకు టీడీపీలో చేరలేదు. రెండు రోజుల్లో టీడీపీలో చేరతానని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. దేవినేని ఉమతో తనకు ఎలాంటి విబేధాలు లేవంటున్నారు ఆయన.

అటు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ సైతం మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పైగా ఆయన నిన్న చంద్రబాబుని కలిసి మైలవరం టికెట్ తనకే ఇవ్వాలని కోరారు. మైలవరం టికెట్ పై దేవినేనికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని చర్చ జరుగుతోంది. దీంతో మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. ఓవైపు వసంత కృష్ణ ప్రసాద్, మరోవైపు దేవినేని ఉమ.. మైలవరం టికెట్ నాదే అంటే నాదే అంటూ ప్రచారం చేసుకోవడంతో.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ అయోమయంలో పడిపోయింది. ఇంతకీ మైలవరం టీడీపీ అభర్థి ఎవరో త్వరగా తేల్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ గందరగోళానికి పార్టీ అధినేత చంద్రబాబు వీలైనంత త్వరగా తెరదించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో అనుచరులతో వసంత సమావేశం అయ్యారు. రెండు మూడు రోజుల్లో టీడీపీ చేరతానని ఆయన చెప్పారు. మైలవరం అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ కేశినేని నానికి సవాల్ విసిరారు వసంత. మైలవరం టీడీపీ నేతలను కలుపుకుని ముందుకెళ్తానన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. దేవినేని ఉమతో తనకు ఎలాంటి విబేధాలు లేవని తేల్చి చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

”వారి దగ్గరికి వెళ్లి కూర్చుని మా మధ్య జరిగిన విషయాల పట్ల క్లారిటీ తీసుకోవడానికి నాకేమీ సంశయాలు లేవు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రం ముందుకెళ్లడం కోసం నేను ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలో ఒక్క మైలవరం నియోజకవర్గం మాత్రమే వెనుకబడి ఉందని, అదీ నా అసమర్థత వల్లే అని కేశినేని నాని భావిస్తే.. ఆయనతో చర్చకు నేను సిద్ధం. దానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా” అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.