పొన్నూరులో గెలుపెవరిది : దూళిపాళ్ల డబుల్ హ్యాట్రిక్ కొడతారా ?

మూడు దశాబ్ధాల అధికారం….ఎక్కడా ఎదురొడ్డి నిలబడ్డ వారే లేరు.. ఎంతటివారైనా తన ముందు చిత్తౌతూనే వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు దూళిపాళ్ల నరేంద్ర సిద్ధమయ్యారు. అటు టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టేందుకు వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళింది. మరి టీడీపీ అప్రతిహత విజయాలకు వైసీపీ చెక్ పెడుతుందా.. లేక తెలుగుదేశం అభ్యర్ధి ముందు తలవంచుతుందా.. అసలు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది..?
గుంటూరు జిలా పొన్నూరు నియోజకవర్గం ఆది నుంచి టీడీపీకి కంచుకోట. ఈ కంచుకోట బద్దలు కొట్టటం గత 30 ఏళ్లుగా ఏ పార్టీకి చేతగాక చతికిలపడ్డాయి. ఈ స్ధానంలో టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు .. తెలుగుదేశందే హవా. ఈ నియోజకవర్గాన్ని దూళిపాళ్ల కుటంబం మూడు దశాబ్దాలుగా హస్తగతం చేసుకుంటోంది. అయితే ఈసారి ఎన్నికలు అటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య పోటాపోటీగా జరిగాయి. దీంతో అభ్యర్ధుల గుండెల్లో ఆందోళన నెలకొంది. ప్రజా తీర్పు ఏవిధంగా ఉండబోతుందోనని అభ్యర్ధులు టెన్షన్ పడుతున్నారు.
సామాజిక, రాజకీయ కోణాల్లో లెక్కలు వేసుకుంటూ .. గెలుపు తమదంటే తమదంటూ అభ్యర్ధులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాళ్ల నరేంద్ర బరిలో దిగారు. ఇక వైసీపీ తరుపున కిలారు రోశయ్య పోటీ చేశారు. అయితే ప్రజా తీర్పు యదాతథంగా వస్తుందని.. తాను వరుసగా 6వసారి కూడా గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తానని .. టీడీపీ అభ్యర్ధి దూళిపాళ్ల నరేంద్ర అంటున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వ వ్యతిరేకత, వంశపారంపర్య రాజకీయాలకు ఈ సారి ప్రజలు చరమగీతం పాడతారని.. నరేంద్ర డబుల్ హ్యాట్రిక్‌కు బ్రేక్ పడటం ఖాయం అంటున్నారు.. వైసీపీ అభ్యర్ధి కిలారు రోశయ్య.
వరుసగా ఐదుసార్లు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నేతగా దూళిపాళ్ల నరేంద్రపై .. నియోజకవర్గంలో ప్రత్యేక చర్చ నడుస్తోంది. అసలు నరేంద్ర వరుస విజయాల వెనక రహస్యం ఏమిటంటే.. ఇక్కడ బరిలోకి దిగే ప్రత్యర్ధి స్ధానికుడు కాకపోవటం ఒక్కటే అని చెబుతుంటారు. ప్రతిసారి ఎన్నికలు రాగానే జిల్లాలో ఇతర నియోజకవర్గాల నేతలు ఇక్కడ పోటీ చేయటం వల్ల .. స్థానికంగా, సామాజికవర్గం పరంగా, పార్టీ పరంగా పట్టుసాధించలేకపోవటం, తద్వారా ఓటమి పాలవ్వటం జరుగుతుందని .. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి వైసీపీ నరేంద్రకు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్‌తో కిలారు రోశయ్యను రంగంలోకి దింపి .. మరో ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం దాదాపుగా సక్సెస్ అయ్యిందని ఓటర్లు వైసీపీకి పెద్ద పీట వేశారనే టాక్ నడుస్తోంది. ఈసారి నరేంద్ర పీఠం కదలక తప్పదని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
గతంలో సాదాసీదాగా జరిగిన ఎన్నికలు ఈ సారి పోటాపోటీగా జరగటంతో.. గెలుపు ఎవరిదనేది ఉత్కఠ కలిగిస్తోంది. పొన్నూరులో ఈసారి ఎవరు గెలుస్తారు. ఈసారి కూడా నరేంద్రకే ప్రజలు పట్టం గడతారా.. డబుల్ హ్యాట్రిక్‌తో ప్రత్యర్ధిని నరేంద్ర చిత్తు చేస్తారా.. లేదంటే నరేంద్ర కోటలో వైసీపీ పాగా వేస్తుందా… అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనికి సమాధానం దొరకాలంటే చూడాలి ఫలితాల్లో ఎవరు పట్టు సాధించారో.