జనసేనపై విమర్శలు, జగన్‌పై ప్రశంసలు.. అయినా ఆ ఎమ్మెల్యేని పవన్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదు?

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 12:39 PM IST
జనసేనపై విమర్శలు, జగన్‌పై ప్రశంసలు.. అయినా ఆ ఎమ్మెల్యేని పవన్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదు?

Updated On : August 15, 2020 / 3:27 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కు కదలలేక నానా తంటాలు పడుతోంది. పార్టీ సంగతి పక్కన పెడితే దానికున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి అధినేత పవన్‌కు. పార్టీలో ఉన్న కీలక నేతలు ఇప్పటికే తప్పుకోగా… రాపాక వరప్రసాద్ అటు తప్పుకోరు… అలాగని పార్టీతోనే ఉండడం లేదు.



సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా పవన్ పట్టించుకోవడం లేదట:
సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక నుంచే పవన్‌కు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. తనను సస్పెండ్ చేస్తే వెంటనే వెళ్లి వైసీపీలో చేరిపోవాలని చూస్తున్నారు ఆయన. సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నా… ఆ దిశగా పవన్ కల్యాణ్‌ మాత్రం చర్యలు తీసుకోని పరిస్థితులు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికలు ముగిసింది మొదలు… జనసేన టికెట్ పైనే ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక… పార్టీకి విరుద్ధంగా వైసీపీతో కలిసి సాగుతున్నారు. సీఎం హోదాలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు జైకొడుతూ.. జనసేనను, ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్‌పైనా ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు.



సొంత బలంతోనే ఎమ్మెల్యేగా గెలిచా:
రాపాక పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా ఇప్పటి వరకూ పవన్‌ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయ్యింది. జనసేన ఓ గాలి వాటం పార్టీ అని ఆ పార్టీ టికెట్ పైనే పోటీ చేసినా… తాను సొంత బలంతోనే గెలిచానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను జగన్‌తో కలిసి వైసీపీలోనే సాగుతున్నట్లుగా రాపాక చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు మంళవారం పెను దుమారమే రేపాయి. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసిన రాపాక… తాను జనసేనను గానీ పార్టీ అధినేత పవన్‌ను గానీ దూషించలేదని, పార్టీకి వ్యతిరేకంగా సాగలేదని పేర్కొనడం విశేషం.



వైసీపీలో చేరేందుకు రాపాక తహతహ:
పార్టీకి వ్యతిరేకంగా తాను సాగుతున్నానని జనసేన అధిష్ఠానం అనుకుంటే… తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని రాపాక ఎదురు ప్రశ్న వేస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటే.. తక్షణమే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అంటున్నారు. ఇంత చేస్తున్నా జనసేన మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పవన్‌ కూడా పట్టించుకోవడం లేదు. జనసేనను, పవన్ కల్యాణ్‌ను ఓ రకమైన ఆత్మరక్షణలో పడేశారన్న టాక్‌ నడుస్తోంది. ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే ఆయన వైసీపీలోకి అఫీషియల్‌గా వెళ్లిపోవాలనుకుంటున్నారు. మరి పవన్‌ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలంటున్నారు.