వంగవీటి రాధా, హర్షకుమార్‌ ఫ్రెండ్ షిప్ వెనుకున్నది ఎవరు

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 10:35 AM IST
వంగవీటి రాధా, హర్షకుమార్‌ ఫ్రెండ్ షిప్ వెనుకున్నది ఎవరు

Updated On : February 13, 2020 / 10:35 AM IST

ఆయన ఏ పార్టీలో ఉన్నారు.. ఉన్నారు ఏదో ఒక పార్టీలో.. ఈయనే పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఏదో ఒక పార్టీలో ఉన్నారు. అసలు పార్టీల్లో ఉన్నారో లేదో తెలియని ఆ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. రాజకీయ ప్రాబల్యం లేకపోయినా.. తమ సామాజిక వర్గాల్లో కాస్తో కూస్తో బలమున్న నాయకులుగా పేరు పడ్డ వీరిద్దరూ ఒక్కటవ్వడం.. వన్‌ ప్లస్‌ వన్‌ టూ అవుతుందా? లేక వన్‌ ప్లస్‌ వన్‌ జీరో అవుతుందా? 

రాజధాని అంశంలో కలిసి ముందుకెళ్లబోతున్నారా?
బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది వంగవీటి రాధాను చూస్తే అర్థమవుతుంది. అలానే ఎంపీగా పని చేసిన తర్వాత ఆయన ఉన్న పార్టీ కారణంగా ఎటూ కాకుండా పోయారు హర్షకుమార్‌. ఇద్దరిలోనూ ఆవేశం ఉంది. కానీ, దానిని వాడడంలోనే వైఫల్యం కనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరూ ఒక అంశం మీద కలుస్తున్నారు. రాజధాని విషయంలో ఈ నాయకులు ఇద్దరూ కలసి ముందుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారు. అమరావతి రైతులు ఇప్పటికే తమ పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. వారికి అండగా పార్టీలు నిలబడుతున్నాయి. కానీ, ముందుండి పూర్తిస్థాయిలో నడిపించేందుకు మాత్రం ఎవరూ లేరంటున్నారు.

వరుస ఓటములే రాధా వెనుకబాటుకు కారణమా?
చాలా బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వంగవీటి రాధా బలమైన నేతగా ఎదగలేకపోతున్నారు. రాజకీయంగా కీలక పాత్ర పోషించే బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆ కుటుంబం వెంట నడిచేందుకు అనుచరగణం సిద్ధంగా ఉన్నా ఇమేజ్‌ మాత్రం పెంచుకోలేకపోయారని అంటున్నారు. వరుస ఓటములు ఇందుకు కారణమని జనాలు అనుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలపై రాధా స్పందించరు. ఏదైనా పెద్ద విషయం వస్తే.. దానిని సాగదీసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కూడా ఆయనలో ఉండదంటారు. అందుకే ఆయనకు ఫాలోయింగ్‌ పెరగడం లేదనే అభిప్రాయం ఉంది.

హర్షకుమార్‌తో కలసి రావులపాలెంలో భారీ ర్యాలీ:
వంగవీటి రాధాలో ఇప్పుడు కొంత మార్పు కన్పిస్తోందని జనాలు అనుకుంటున్నారు. ఆయన రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా గ్రామాల్లో తరచూ పర్యటిస్తున్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. అలాగే నిత్యం అమరావతి జేఏసీ నేతలతో టచ్‌లో ఉంటున్నారట. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ ప్రతి రోజు విజయవాడలో కూడా ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నారు రాధా. పక్క జిల్లాలకు వెళ్లి మరీ రాజధాని ఉద్యమానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. అనుకున్నదే తడవుగా మాజీ ఎంపీ హర్షకుమార్‌తో కలిసి రావులపాలెంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు.

ఇప్పుడు వంగవీటి రాధా-హర్షకుమార్‌ కాంబినేషన్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ అమరావతి ఉద్యమం కోసం ఏదో ఓ ర్యాలీ చేపట్టి సరిపెడతారా..? లేక ఈ బంధాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. హర్షకుమార్‌ జైలు నుంచి బయటకు వచ్చాక సీఎం జగన్‌ మీద, వైసీపీ పాలన మీద మాటల దాడి కొనసాగిస్తున్నారు. సహజంగా వీరిద్దరి కలయికను మామూలుగానే చూడాల్సి ఉన్నా వంగవీటి రాధాలో వచ్చిన మార్పు చూస్తుంటే భవిష్యత్‌లో ఏదో కీలక పరిణామాలు చోటు చేసుకుబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 

వీరి వెనుక ఉన్నదెవరు?
వంగవీటి రాధా, హర్షకుమార్‌ బలమైన సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కావడంతో వ్యవహారం ఆసక్తిగా మారిందంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులను తమకు అనుకూంగా మలుచుకునే దిశగా ఈ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇద్దరు నేతలకూ వారి వారి సామాజికవర్గాలను ప్రభావితం చేయగల బలం ఎంతో కొంత ఉంది. ఈ క్రమంలో వీరిద్దరు ఇప్పటి నుంచి కలిసి పని చేస్తే.. భవిష్యత్తులో తప్పకుండా ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇదే సమయంలో వీరి వెనుక ఎవరున్నారో అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హర్షకుమార్‌ను టీడీపీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం:
ప్రస్తుతానికైతే రాధా టీడీపీలోనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఒకటికి రెండుసార్లు చంద్రబాబు, లోకేశ్‌తో కలిశారు. ఆ తర్వాత నుంచే రాజధాని గ్రామాల్లో పర్యటనలు చేపడుతున్నారట. ఎన్నికలకు ముందు హర్షకుమార్‌ కూడా టీడీపీలో చేరినా.. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. హర్షకుమార్‌ను తిరిగి తమ ట్రాక్‌లో వచ్చేలా చేయడానికి టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్తున్నారట. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్‌ వెనుక టీడీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాత టీడీపీ పక్కా ప్లాన్‌తో వీరిద్దరినీ ఏకం చేసి ముందుకెళ్తోందని భావిస్తున్నారు.