స్పిరిట్ గా ఉంటుందని వైఎస్సార్ మండలి తెస్తే ఆల్కహాల్ చేశారు : చెవిరెడ్డి

ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించటానికే ఈ రోజు తప్పని సరి పరిస్ధితుల్లోనే మండలి రద్దు బిల్లు సభలో పెట్టాల్సి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. గతంలో ఒక స్పిరిట్ గా ఉంటుందని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారుతెస్తే దీన్ని ఈరోజు వీళ్ళు ఆల్కహాల్ గా మార్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పబ్లిక్ ఇంట్రస్ట్ లు గాలికొదిలి….పర్సనల్ ఇంట్రెస్ట్ గా సభను నడుపుతున్నప్పుడు ఈ సభ మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
శాసన మండలి రద్దుపై సోమవారం జనవరి 27న ఏపీ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ…. నేడు శాసన సభలో చక్కగా చర్చలు జరుగుతున్నాయని.. శాసన మండలిలో రాజకీయ ప్రయోజనాలకి అనుగుణంగా చట్టాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. అది శాసనమండలే తప్ప శాననతీర్మానమండలి కాదని ఆయన అన్నారు. ఒక పార్టీ ప్రతిపాదించినటువంటి బిల్లు, చట్టసభల్లో ఆమోదించిన బిల్లు మండలికి వచ్చినప్పుడు చైర్మన్ ప్రజామోదం పొందిన బిల్లును వ్యతిరేకించారని ఆరోపించారు.
విధాన పరమైననిర్ణయాలు తీసుకోలేని మండలి మనకు అవసరమా అని ఆయన అన్నారు. ఈరోజు బీహార్ సీఎం చట్టసభలతో అనుమతి లేకుండా 17 సార్లు ఆర్డినెన్స్ తెచ్చి కొన్ని బిల్లులను పాస్ చేయించుకున్నారని గుర్తుచేశారు. పెద్దల సభను గౌరవించాలి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి..ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలని సీఎం జగన్ బిల్లును పెద్దల సభకు పంపితే సభ విలువను దిగజారుస్తున్నప్పుడు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని మండలిని ఎందుకు కొనసాగించాలని ఆయన అన్నారు.
రాజ్యాంగానికి విలువ ఇవ్వనప్పుడు , ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వనప్పుడు, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజల రక్షణకు, ప్రజాస్వామ్య రక్షణకు, పరిరక్షణకు తప్పనిసరి పరిస్ధితుల్లోనే ఈరోజు శాసన సభ ఈనిర్ణయం తీసుకుందని చెవిరెడ్డి వివరించారు. సీఎం జగన్ తీసుకున్న ఈనిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తారని అనుకుంటున్నానని చెవిరెడ్డి పేర్కోన్నారు.