వైసీపీ సమర శంఖారావం: మొదటి విడత 5 జిల్లాలు

అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ బూత్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 6 బుధవారం నుంచి సమర శంఖారావం పేరుతో జిల్లాల వారిగా బూత్ కమిటీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. సమర శంఖారావం మెదటి విడతలో బాగంగా ఐదు జిల్లాల్లో పర్యటనలు ఉండే విధంగా ప్లాన్ చేశారు.
క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రజల్లోకి వెల్లాలంటే ఏ రాజకీయ పార్టీకైనా బూత్ కమిటీలు బలంగా ఉండాలి. అయితే గత ఎన్నికల్లో వాటి బలహీనత వల్లే నష్ట పోయిన వైసీపీ ఈసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఏడాదిగా బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో నియమించిన వైసీపీ వాటిని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సమర శంఖారావం పేరుతో బూత్ కమిటీలతో అధినేత జగన్ సమావేశమవనున్నారు.
ఫిబ్రవరి 6 బుధవారం నుండి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. మెదటి విడతలో ఐదు జిల్లాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. మెదటగా 6వ తేదీన తిరుపతిలో బూత్ కమిటీలతో జగన్ సమావేశం అవుతారు. రేణిగుంట యోగానంద ఇంజినీరింగ్ కళాశాల ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి ముందు ‘జగనన్న పిలుపు’అనే కార్యక్రమంలో భాగంగా తటస్తులతో ఉదయం 11 గంటలకు తనపల్లి క్రాస్‌లోని పీఎల్ఆర్ గార్డెన్స్‌లో సమావేశం అవుతారు. తర్వాత 1 గంటకు సమర శంఖారావం సభకు జగన్ హజరవుతారు. 7 వ తేదీన కడప, 11 అనంతపురం, 12 నెల్లూరు, 13న ప్రకాశం జిల్లాల్లో సమర శంఖారావ సమావేశాలు జరగనున్నాయి. మెదట విడత సభలు ముగిసిన తరువాత రెండవ విడత ప్రారంభంకానుంది. ఇలా 13 జిల్లాల్లో జగన్ ఈ సభలు నిర్వహించనున్నారు.
గత ఎన్నికల అనుభవాల దృష్య బూత్ కమిటీలను పటిష్టం చెయ్యాలని భావిస్తూ జగన్ ఈసమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసమావేశాల్లో జగన్ కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. పార్టీ నవరత్నాల గురించి ఈ సమావేశాల్లో వివరిస్తారు. ఈ బూత్ కమిటీ సభ్యులతోనే క్షేత్ర స్థాయిలో నవరత్నాలను ప్రజలకు చేరువ చెయ్యాలనేది జగన్ ప్లాన్. దీనితో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించనున్నారు.