అనంత ఎన్నికల్లో యూత్ : రిటైరవుతున్న సీనియర్లు

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 02:21 PM IST
అనంత ఎన్నికల్లో యూత్ : రిటైరవుతున్న సీనియర్లు

Updated On : February 2, 2019 / 2:21 PM IST

ఏపీ రాజకీయాల్లో ఒకేసారి దాదాపు ఒక తరం మొత్తం పదవీ విరమణకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ నేతను కదిపినా తనకంటే తన కొడుక్కో…. కూతురికో టిక్కెట్టిస్తే చాలని మాట్లాడుతుండడమే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లా నేతలు కూడా దాదాపు ఇదే పల్లవిని అందుకున్నారు. మొన్నటి వరకూ జేసీ బ్రదర్స్‌ నుంచి వచ్చిన ఈ మాట.. ఇప్పుడు దాదాపు జిల్లాలోని అందరి నోటా వినిపిస్తోంది.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ నేతల నుంచి తమ వారసులకు కూడా టికెట్లు కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఐతే.. అధినేతను అడగలేక లోలోపల మధనపడుతున్నారు. ఇప్పటికే తమకు టికెట్ వద్దు.. తమ పిల్లలకు కేటాయించమంటూ జేసీ బ్రదర్స్ అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఆ మేరకు చంద్రబాబుతో నేరుగానే పంచాయితీ పెట్టారు. ఐతే…. అటు వైపు నుంచి పూర్తి హామీ మాత్రం వచ్చినట్టు లేదని సమాచారం.

తాజాగా మంత్రి పరిటాల సునీత తన తనయుడు పరిటాల శ్రీరాం హిందూపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐతే.. ఈ నిర్ణయాన్ని అధినేతకే వదిలేసినట్లు ఆమె ప్రకటించారు. తాజాగా ఎంపీ నిమ్మల కిష్టప్ప సైతం తనకు ఎంపీగా పోటీచేయటం ఇష్టం లేదని.. ఎంఎల్ఏ టికెట్ తనకు కానీ తన కొడుకుకు గానీ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని అడుగుతున్నారు. దీంతో అనంత టీడీపీ నేతల్లో టికెట్ టెన్షన్ నెలకొంది.

పరిటాల కుటుంబం అంటే జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గతంలో నాలుగు సార్లు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచీ ఇక్కడి ప్రజలు పార్టీని, నందమూరి కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో పరిటాల కుటుంబానికి బాగానే పట్టుంది. అందులో భాగంగానే ఈసారి పరిటాల శ్రీరామ్‌ని బరిలో దించేందుకు మంత్రి పరిటాల సునీత ప్రయత్నాలు మొదలు పెట్టారు.

 

మరోవైపు రెండుసార్లు  హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నిమ్మల కిష్టప్ప 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకొంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పరిటాల శ్రీరామ్‌కి లైన్‌ క్లియర్‌ అయినట్లే కనిపిస్తోంది. హిందూపురంలో పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దింపితే కచ్చితంగా విజయం సాధించవచ్చు అనే ధీమాతో మంత్రి పరిటాల సునీత ఉన్నారు.

మొత్తానికి అనంతలో వారసుల పొలిటికల్‌ ఎంట్రీ రసవత్తరంగా మారింది. మరి అధినేత మనసులో ఏముంది..? ఈసారి ఛాన్స్‌ ఎవరికి దక్కుతుంది..? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.