ఏడాదికి ఒక్కసారే : ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం

విశాఖపట్నం: సింహాచల అప్పన్న ఆలయంలో ఘనంగా చందనోత్సవం జరుగుతోంది. వైశాఖ శుధ్ద తదియ రోజు అప్పన్న స్వామి భక్తులకు నిజరూపం దర్శనం ఇవ్వనున్నారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఇస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మరోవైపు భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు మంగళవారం తెల్లవారు ఝూమున 3 గంటలకు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి నిజ రూప దర్శనం చేసుకున్నారు. అనంతరం ఇతర భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. టీటీడీ తరుఫున ఆలయ జేఈవో.. అప్పన్నస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
స్వామివారి దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేశారు. పోని తుపాను ఎఫెక్టు వల్ల ఒడిషాకు చెందిన భక్తుల ఈ ఏడాది తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో భక్తులకు మంచినీళ్లు, ఆహారం అందించేదుకు దేవస్ధానంతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు ఏర్పాట్లు చేశాయి. సుమారు 1600 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. 108 అంబులెన్స్లు సిధ్దంగా ఉంచారు. సాయంత్రం 7 గంటలవరకు క్యూలైన్ లో ఉన్న భక్తులందరికీ స్వామి వారి నిజరూప దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు.