న్యూ ఇయర్ వేడుకలు : తిరుమల దూరం.. ఎందుకు?

చిత్తూరు : కొద్ది గంటల్లో 2018కి బై..బై చెబుతాం..2019కి గ్రాండ్‌గా వెల్ కం చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. దీనిని ఆంగ్ల సంవత్సరాది కూడా అంటుంటారు. కొత్త సంవత్సరం రోజున ఉదయమే లేచి గుడికి వెళ్లి పూజలు..అర్చనలు..దర్శనాలు చేసుకుంటుంటారు…జనవరి ఫస్ట్ సందర్భంగా ఆలయాలను అందంగా అలంకరిస్తుంటారు. ఆ రోజున భగవంతుడిని దర్శించుకుంటే అంతా శుభాలే కలుగుతాయని అనుకుంటుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సందడి చెప్పనక్కర్లేదు. అయితే…తిరుమలలో మాత్రం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు.
ఏమిటీ కారణం…
ఆంగ్ల సంవత్సరాది వేడుకల సందర్భంగా హిందూ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదని దేవాదాయ శాఖకు చెందిన ధర్మ పరిరక్షణ ట్రస్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాలను టీటీడీ ఈ సంవత్సరం కూడా పాటిస్తోంది. ఆలయాల్లో పండుగ వాతావరణం..అలంకరణలు..శుభాకాంక్షలు చేయడం హిందూ వైదిక విధానం కాదని దేవాదాయ శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం నుండి టీటీడీ నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ వస్తోంది.
అయితే భక్తులు మాత్రం ఎక్కువగా వస్తారని ఊహించిన టీటీడీ..పలు ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక దర్శనాలు…ఆర్జిత సేవలు రద్దు చేయగా..ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రం బ్రేక్ దర్శనం టికెట్లు జారీ చేస్తోంది. సామాన్య భక్తుల దర్శనానికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. వేకువజామున 4.30 గంటలకే సర్వదర్శనం ప్రారంభించనున్నారు. వీఐపీలకు మాత్రం వేకువజామున 2 గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు.