Huge Devotees in Srisailam Temple : వరుస సెలవుల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. వరుస సెలవులతో భారీ సంఖ్యలో ప్రజలు దేవాలయాల్లో స్వామి,అమ్మవార్ల దర్శనానికి బారులుతీరారు.

Srisailam Temple
Tirumala Tirupati : తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. వరుస సెలవులతో భారీ సంఖ్యలో ప్రజలు దేవాలయాల్లో స్వామి,అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంకు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు మల్లిఖార్జున స్వామి దర్శనంకోసం క్యూలైన్లలో వేచిఉన్నారు. ఆదివారం స్వామివారి దర్శనంకోసం భక్తులు పోటెత్తగా.. సోమవారం కూడా స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వాహనాలతో పూర్తిగా నిండిపోయింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read : Sudarsan Pattnaik : క్రిస్మస్ పర్వదినాన పూరి బీచ్‌లో శాంతాక్లాజ్ సైకత శిల్పం
శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున 4గంటల నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనాలకోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరుస సెలవులకుతోడు సోమవారం కావడంతో భక్తులతో శ్రీశైలం పురవీధులు కిక్కిరిశాయి. అష్టపీఠాల్లో ఉన్నటువంటి శక్తిపీఠం ఒకటి ఉండటం, ద్వాదశి జ్యోతిర్లింగం కావడంతో మల్లిఖార్జున భ్రమరాంబను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలంతో పాటు మహానంది, యాగంటి శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసాయి.
Also Read : Kamandala Ganapathi Temple : కమండల గణపతి దేవాలయం.. స్వామి పాదాలవద్ద పొంగిపొర్లే పవిత్ర గంగాజలం విశిష్టత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనార్ధం భక్తులు పోటెత్తారు. క్యులైన్లు భక్తులతో నిండిపోయాయి.అమ్మవారి దర్శనానికి గంటకుపైగా సమయం పడుతుంది. భక్తుల రద్దీతో ఘాట్ రోడ్డు పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మహామండపం వైపు అనుమతి నిరాకరించారు. ఘాట్ రోడ్డు వైపు దేవస్ధానం భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు కాలినడకన వచ్చి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడి అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. దుర్గగుడి ఈవో రామారావు క్యూలైన్లు సజావుగా సాగేవిధంగా దగ్గరుండి పర్యవేక్షించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామిఅమ్మవార్ల దర్శనానికి రెండుమూడు గంటల సమయం పడుతుంది. అయితే, ఆలయం వద్ద సరైన ఏర్పాట్లు లేవంటూ కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన ఆలయ నిర్వాహకులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.