భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. కొనసాగుతున్న రద్దీ, శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది టీటీడీ. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.

భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. కొనసాగుతున్న రద్దీ, శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

Tirumala Rush : తిరుమలగిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లతో పాటు అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి.

3 కిలోమీటర్ల మేర క్యూలైన్..
శిలాతోరణం నుంచి ఆలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్ లో బారులు తీరారు. టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది టీటీడీ. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గత వారం రోజులుగా భక్తు రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ఇవాళ దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్నటి రోజున శిలాతోరణం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లు వెలుపల వ్యాపించాయి. ఇవాళ రద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికే ఉంది. అయినప్పటికీ స్వామి వారి దర్శనానికి దాదాపు 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది.

వేసవి సెలవులు ముగిసే వరకు ఇంతే..
తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు ఒకవైపు, దానికి తోడు వారాంతం కావడంతో తిరుమలకు భక్తులకు భారీగా తరలివస్తున్నారు. గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. మరికొన్ని రోజుల పాటు అంటే వేసవి సెలవులు ముగిసే వరకు తిరుమలలో ఈ రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. వీకెండ్ లో శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. భారీ రద్దీ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ప్లాన్ చేసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

జూన్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీలకు కేటాయించే బ్రేక్ దర్శనాలను వారంలో మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారం) క్రమబద్దీకరించి కేటాయిస్తున్నారు. ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వాళ్లకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారు. మొత్తం మీద తిరుమలకు భక్తుల రద్దీ మరికొంత కాలం అంటే వేసవి సెలవులు ముగిసే వరకు కొనసాగుతుందని టీటీడీ చెబుతోంది. అనూహ్యంగా భక్తుల రద్దీ ఏర్పడిన కారణంగా క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు క్యూలైన్ల వద్దకే చేరవేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది.

* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
* అన్ని కంపార్ట్ మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లు
* శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం
* వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భారీగా రద్దీ
* అధిక రద్దీ నేపథ్యంలో జూన్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
* నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య -70వేల 668
* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లు

Also Read : రైతు పంట పండింది..! పొలంలో దొరికిన విలువైన వజ్రం, దాన్ని ఏం చేశాడంటే..