Covid Negative Certificate : తిరుమలకు వచ్చే యాత్రికులకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
తిరుమలకు వచ్చే 18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.

Ttd Eo Jawahar Reddy
Covid Negative Certificate : తిరుమలకు వచ్చే 18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్ని వయస్సుల వారు తప్పని సరిగా నెగెటివ్ సర్టిఫెకెట్ తేవాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
తిరుమల అన్నమయ్య భవన్ వద్ద ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ…కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా, భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తేవాలని నిబంధన విధించామని తెలిపారు. 18 ఏళ్ళ లోపు వారికి వ్యాక్సిన్ లేనందువల్ల వారు నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తేవాలని ఈవో చెప్పారు.
అక్టోబర్ 11 వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. అలిపిరి నుంచి తిరుమల నడక దారిని బ్రహ్మోత్సవాలలో అందుబాటులోకి తెస్తామని జవహర్ రెడ్డి చెప్పారు.
దాతల సహకారంతో అలిపిరిలో నిర్మించిన గోమందిరం, తిరుమలలో నిర్మించిన బూందీ పోటును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. బర్డ్ ఆసుపత్రిలో టీటీడీ ఏర్పాటు చేసిన చిన్నపిల్లల గుండె సంబంధిత వ్యాధుల చికిత్స ఆసుపత్రిని కూడా ముఖ్యమంత్రి చేత ప్రారంభించేందుకు యుధ్ధుప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నామని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు.