Samatha Kumbh 2023: సమతా కుంభ్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళాలు
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.

Samatha Kumbh 2023: హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు నిత్య కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ వేడుక చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
జై శ్రీమన్నారాయణ నామ స్మరణతో సమతా క్షేత్రం పులకించింది. 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు కన్నులపండవగా జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 6 గంటల నుంచి ఆరున్నర గంటల వరకు అష్టాక్షరీ మంత్ర జపం నిర్వహించారు. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ఆరాధన.. సేవాకాలం కొనసాగింది. అనంతరం శాత్తుముఱై జరిపించారు. తీర్థప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు.
సమతామూర్తి సన్నిధిలో 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం
ఉదయం యాగశాల ప్రాంగణంలోని ఆచార్య సన్నిధిలో గురుపరంపర అనుసంధానం జరిగింది. తర్వాత అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం భక్తులతో చేయించారు. యాగశాలలో భగవంతుని ఆరాధన సేవా కాలం, శాంతిపాఠం, వేద విన్నపాలు, వేద పారాయణాలు చేశారు. పూర్ణాహుతి వేద విన్నపాలు, ప్రసాద వితరణ, యాగశాలలో యజమానులకు మంగళా శాసనాలతో కార్యక్రమం సుసంపన్నమైంది. ఆ తర్వాత నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిపించారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేశారు. 6 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ, 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు నిర్వహించారు. రాత్రి ఎనిమిదిన్నరకు నిత్యపూర్ణాహుతి జరిగింది. రాత్రి 9 గంటలకు తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్టి జరిపారు.