Thirumala Balaji : సకల శుభకరం….తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం

వ్యాసతీర్ధుల కాలం నుండే దేవాలయం గోపురం పై విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం విశిష్టతను సంతరించుకుంది.

Thirumala Balaji : సకల శుభకరం….తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం

Ttd

Updated On : August 15, 2021 / 5:16 PM IST

Thirumala Balaji : భారతదేశంలో హిందువులు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా తిరుమల క్షేత్రాన్ని బావిస్తారు. స్వామి వారి దర్శనం కోసం దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. తిరుమలలో  శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం గోపురం పై బాగంలో కనిపించే విమాన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది.  శ్రీ వెంకటేశ్వరస్వామి మూల విరాట్ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత భక్తులు బయటకు వచ్చి వాయువ్య మూలలో ఆలయం పై బాగంలో కనిపించే విమాన వెంకటేశ్వర స్వామిని తప్పనిసరిగా దర్శిస్తారు. గోపుర మధ్యభాగంలో చుట్టూ వెండి మకరతోరణంతో లోపలి భాగంలో వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం కనిపిస్తుంది.

ఈ విమాన వెంకటేశ్వర స్వామిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహాత్యంలో వివరించారు. విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఆలయంలోని స్వామి వారి మూల విరాట్ ను దర్శించినట్లేనని వేదపండితులు చెప్తారు. అనుకోని సందర్భంలో ఆలయంలో మూల విరాట్ దర్శనం జరగని పక్షంలో బయటనున్న విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నా సరిపోతుందట. గతంలో భక్తులు విమాన ప్రదిక్షణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామి దర్శించిన తరువాతే ఆనంద నిలయంలోని స్వామి వారి మూల మూర్తిని చూసేవారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపధ్యంలో ప్రస్తుతం మూల విరాట్ దర్శనం పూర్తయిన తరువాత బయటకు వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు.

వ్యాసతీర్ధుల కాలం నుండే దేవాలయం గోపురం పై విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం విశిష్టతను సంతరించుకుంది. వ్యాస తీర్ధులు 12 సంవత్సరాలపాటు శ్రీవారి ఆలయంలో అర్చకకాధి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు చరిత్రచెబుతుంది. ఆనాటి నుండి ఆలయ సంప్రదాయంలో విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రాధాన్యతతో కూడుకున్నదిగా భక్తులు భావిస్తున్నారు.

భక్తులే కాకుండా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి సైతం ఆలయం బయటకు వెళ్ళే ముందు విమాన ప్రదక్షిణం చేస్తూ విమాన వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కాసు నిలబడి హారతులు అందుకోవటం ఆచారంగా వస్తుంది. ప్రతి ఏటా జరిగే పవిత్రోత్సవల సమయంలో విమాన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పవిత్ర మాలలను సమర్పిస్తారు. నిత్యం స్వామి వారికి మూడుపూటలా నివేదన సమయంలో ఆర్చకులు ఆలయం లోపలి నుండే విమాన వెంకటేశ్వరునికి నివేదనలు సమర్పిస్తారు.

గర్భాలయంలో ఎక్కువ సేపు స్వామి దర్శనం అందని వారు వాయువ్యమూలలో గోపురంపై దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ కోర్కెలను ఆయనకు చెప్పుకుంటుంటారు. మూలవిరాట్ దర్శనం తరువాత విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలిగిపోయి సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.