వినాయకచవితి : పాలవెల్లికి ఉన్న విశిష్టత తెలుసుకుందాం

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 10:29 AM IST
వినాయకచవితి : పాలవెల్లికి ఉన్న విశిష్టత తెలుసుకుందాం

Updated On : August 26, 2019 / 10:29 AM IST

వినాయకచవితి పూజా విధానం ఇతర పండుగలకు భిన్నంగా ఉంటుంది. గణేషుడి వాహనం ఎలుకను పూజిస్తాం. ఏనుగు తొండంతో ఉంటాడు కాబట్టి.. అత్యంత బలశాలి అయిన ఏనుగును కూడా పూజించినట్లే. పూజలో తప్పనిసరిగా ఉండాల్సింది పాలవెల్లి. ఇది లేకపోతే గణేశుని పూజ లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారో తెలుసుకుందాం.

ఈ విశ్వం అనంతం. భూమి అణువంత. ఆ భూమిపై నిలబడి పైకి చూస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలు కోటానుకోట్లు. లెక్కకు చిక్కవు. అలా ఒక్కసారి తలెత్తి చూస్తే ఆకాశంలో పాల సముద్రాన్నే గుర్తు చేస్తాయి. అందుకే వాటిని పాలపుంత అంటాం. దాన్నే పాలవెల్లి అంటాం. ఆ పాలవెల్లికి సంకేతంగా వినాయకుడి పూజలో ఒక చతురస్రాకారంలో ఉండే చెక్కలతో చేసిన పాలవెల్లిని కడతారని పండితులు చెబుతారు.

పాలవెల్లి అంటే పాలపుంత అనుకుంటే.. అందులో నక్షత్రాలు మనం కట్టే కాయలు, పండ్లు. ఈ పాలవెల్లికి వెలగపండు, మారేడు కాయ, బత్తాయి, మొక్కజొన్నపొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ వంటి ఈ సీజన్ లో దొరికే అన్నింటినీ కడతారు.

వినాయకపూజ అంటే ప్రకృతిని ఆరాధించటమే. అందుకే ఆకులతో పూజిస్తారు. 21 రకాల నుంచి సేకరించిన ఆకులనే పత్రిగా పిలుస్తాం. అంటే వెలగ, జిల్లేడు, మారేడు, మామిడి, రేగు, ఉత్తరేణి వంటి పత్రాలతో పూజిస్తారు. ఇవేమీ లేకపోయినా..వినాయకుడి  మట్టి ప్రతిమను చేసి, పాలవెల్లిని వేలాడదీస్తే చాలంటారు. గరికతో పూజిస్తే చాలు విజయాలు ఇస్తాడని చెబుతోంది శాస్త్రం.

గణేశుని పూజ అంటే కేవలం పూజ మాత్రమే కాదు.. ప్రకృతిని పూజించటం. ఆరాధించటం. పూజలో వాడే ప్రతీ ఆకు ప్రకృతే. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయ అనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని చెబుతుంది. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశం(లయం) సూచించేందుకు పాలవెల్లిని ఉంచి పూజిస్తారు. పాలవెల్లి చతురస్రాకారంలో ఉంటుంది. అంటే నాలుగు దిక్కులు. అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే. మొత్తంగా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు. పాలవెల్లికి పసుపు రాసి.. కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.