Makar Sankranti 2024: భోగి పండ్ల ప్రాముఖ్యత

సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్లే గుర్తుకువస్తాయి.

Makar Sankranti 2024: భోగి పండ్ల ప్రాముఖ్యత

Makar Sankranti 2024

Updated On : January 10, 2024 / 9:54 PM IST

తెలుగువారికి సంక్రాంతి అతి పెద్ద పండుగ. సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్లే గుర్తుకువస్తాయి. ఆ రోజున రేగుపళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, బంతిపూలరెక్కలు, చెరుకు ముక్కలని తీసుకుని…. మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగినాడు రేగుపళ్లని ఇంతగా తల్చుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి.

రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఓ నమ్మకం. అందుకు అనుగుణంగానే దీన్ని ‘ఇండియన్‌ డేట్‌’ అనీ ‘ఇండియన్‌ జుజుబీ’ అనీ పిలుస్తారు. అందుకు తగినట్లుగానే మన పురాణాలలోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది. సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు.

ఔషధ గుణాలు

రేగుపళ్లు సకల ఆరోగ్యాలనూ అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి.  జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి.

రేగుపళ్లు నిజంగా వీరిపాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్లలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి.  రేగుపళ్లని ఎండుపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది. మరి ఇంత ప్రాముఖ్యం ఉన్న భోగిపళ్ల సంప్రదాయాన్ని పాటించకుండా వుండగలమా?

Makar Sankranti 2024: సంక్రాంతి స్పెషల్ వంటకాలు