Asia Cup 2025: భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు.. పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్..! మళ్లీ ఆయనే..!
దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ రెండు మెయిల్స్ పంపింది పాక్ క్రికెట్ బోర్డు.

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ ఫోర్ లో రేపు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడబోతున్నాయి. భారత్ తో కీలక మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్ కు ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. దీన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది.
భారత్, పాక్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ లోనే హ్యాండ్ షేక్ వివాదం తలెత్తింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆండీపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది పీసీబీ. అంతేకాదు ఆండీని తొలగిస్తేనే టోర్నీలో కొనసాగుతామని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత భంగపాటుకు గురైంది. అయితే, పాక్ బెదిరింపులను ఐసీసీ లెక్క చేయలేదు. ఆండీని తొలగించలేదు. అంతేకాదు.. భారత్ తో పాక్ ఆడబోయే మ్యాచ్ కు మళ్లీ ఆయనే రెఫరీగా వ్యవహరించనున్నారు. ఇది పాక్‌కు మానసికంగా పెద్ద దెబ్బే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆండీని తొలగించాలని పదే పదే పాక్ అభ్యర్థించినప్పటికీ ఐసీసీ పట్టించుకోలేదు. కాగా, ఆదివారం జరిగే మ్యాచ్‌కు సంబంధించి అధికారుల జాబితా ఇంకా బయటకు రాలేదు. ఈ టోర్నమెంట్‌లో మరో మ్యాచ్ రిఫరీగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్‌సన్ వ్యవహరిస్తున్నారు.
తన తొలి మ్యాచ్ లో భారత క్రికెటర్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. ఈ మ్యాచ్ కు పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉన్నారు. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో సంప్రదాయాన్ని పాటించలేదని పాక్ సీరియస్ అయ్యింది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ రెండు మెయిల్స్ పంపింది పాక్ క్రికెట్ బోర్డు. పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ నుండి తొలగించాలని కోరింది. తామే ఆడే మ్యాచుల నుంచి ఆయనను తప్పించాలంది. ఈ రెండు డిమాండ్లను ఐసీసీ తోసిపుచ్చింది. తన ఎలైట్ ప్యానల్ రిఫరీని సమర్థించుకుంది.
పైక్రాఫ్ట్ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించారనే PCB ఆరోపణలను ICC తోసిపుచ్చింది. ఆయన కేవలం ఒక మెసెంజర్ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ వివాదం నేపథ్యంలో ఐసీసీ కీలక భేటీ ఏర్పాటు చేసింది. రిఫరీ పైక్రాఫ్ట్, పాకిస్తాన్ జట్టు మేనేజ్ మెంట్, కెప్టెన్ సల్మాన్, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, నేజర్ నవీద్ అక్రమ్ చీమా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: ఆదివారం పాక్‌తో మ్యాచ్ పై ప్రశ్న.. నాలుగు పదాలతో సూర్య సమాధానం.. పేరును ప్రస్తావించకుండానే..