Tilak Varma: తోపు వర్మ తోపు.. విజయ తిలకం దిద్దిన వీరుడు..
ఛేజింగ్ లో ఆరంభం నుంచి వికెట్లు పడుతున్నా.. తిలక్ వర్మ అదరలేదు, బెదరలేదు.

Courtesy @ ESPNCricinfo
Tilak Varma: ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. నరాలు తెగేంత ఉత్కంఠతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత్ మట్టికరిపించింది. 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముందు స్పిన్నర్లు చెలరేగారు. పాక్ బ్యాట్స్ మెన్ కట్టడి చేశారు. భారీ స్కోర్ చేయనివ్వకుండా ఆపారు.
ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మాయ చేశాడు. పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఆ తర్వాత ఛేజింగ్ లో యువ ఆటగాడు, తెలుగోడు తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఒంటి చేత్తో జట్టుని విజయతీరాలకు చేర్చాడు తిలక్ వర్మ.
అసలే ఫైనల్ మ్యాచ్. పైగా ప్రతర్థి పాకిస్తాన్. 20 పరుగులకే 3 వికెట్లు డౌన్. భారత్ గెలుపుపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో క్రీజులోకి వచ్చాడు యువ కిశోరం తిలక్ వర్మ. ఫైనల్ లో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు వర్మ. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా పొరపాట్లు చేయకుండా షాట్లు కొట్టాడు. ఇక గెలుపు కష్టమే అన్న పరిస్థితి నుంచి భారత్ ను విజేతగా నిలపడంలో వర్మది కీ రోల్. ఛేజింగ్ లో ఆరంభం నుంచి వికెట్లు పడుతున్నా.. తిలక్ వర్మ అదరలేదు, బెదరలేదు. గెలుపు ఖాయం అనుకున్న ప్రత్యర్థికి తెలుగోడి దెబ్బ రుచి చూపించాడు. పాకిస్తాన్ కు నిద్ర లేని రాత్రులు మిగిల్చాడు.
అసాధారణ రీతిలో బ్యాటింగ్..
టార్గెట్ పెద్ద స్కోర్ ఏమీ కాదు. జస్ట్ 147 పరుగులే. కానీ, ఆరంభంలోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), శుభ్‌మన్ గిల్ (12) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ వచ్చాడు. అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశాడు. సంజూ శాంసన్ (24)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. శాంసన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (33)తో కలిసి తిలక్ వర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దూబే కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో వేగంగా ఆడి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు.
చివరలో దూబే ఔట్ అయినా తిలక్ వర్మ సంయమనంతో ఆడాడు. జట్టును గెలిపించాడు. పాక్ సీనియర్ పేసర్ హరీస్ రవూఫ్ వేసిన చివరి ఓవర్ లో టీమిండియా విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. తిలక్ వర్మ ఓ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. రింకూ సింగ్ విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టడంతో భారత్ టోర్నీ విజేతగా అవతరించింది.
భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన, తిలక్ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. భారత్ ఆసియా కప్ గెలవడం ఇది 9వ సారి.
టీమిండియా నయా హీరో..
53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు తిలక్ వర్మ. 3 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు వర్మ. అసాధారణ బ్యాటింగ్ తో భారత్ కు విజయ తిలకం దిద్ది.. తోపు వర్మ తోపు అంటూ ఫ్యాన్స్ తో ప్రశంసలు పొందుతున్నాడు. చిరకాల ప్రత్యర్థిని ఓడించడంలో భారత్ ను విజేతగా నిలపడంలో తిలక్ వర్మ పాత్ర ఎనలేనిది. దీంతో తిలక్ వర్మ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం భారత్ లో క్రికెట్ అభిమానులు తిలక్ వర్మ నామజపం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.