విహారీ సెంచరీ : భారత్ 416 ఆలౌట్

మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారీ సెంచరీ చేయడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. విహారీకి తోడుగా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 264 పరుగులతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన కోహ్లీసేన ఆరంభంలోనే రిషబ్‌పంత్ వికెట్ కోల్పోయింది. తర్వాత జడేజా కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో విహారీకి తోడుగా ఇషాంత్ ఇన్నింగ్స్‌ని నడిపించాడు. వీరిద్దరూ కలిసి 112 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్‌ను టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా వణికించాడు. నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తించాడు. బుమ్రా ధాటికి ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి విండిస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్ జట్టు 87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. క్రిజ్‌లో భారీకాయుడు కార్నవాల్‌తోపాటు హామిల్టన్ ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ 329 పరుగులు ఆధిక్యంలో ఉంది.
టెస్టుల్లో భారత్ తరపున బుమ్రా మూడో హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో రెండో బంతికి బ్రావో.. స్లిప్‌లో కేఎల్ రాహుల్ చేతికి చిక్కగా.. మూడో బంతికి బ్రూక్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి చేజ్ కూడా ఎల్బీగానే ఔటయ్యాడు. దీంతో బుమ్రా ఖాతాలో హ్యాట్రిక్ పడింది. గతంలో 2001లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ అస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేయగా.. 2006లో ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు.