CCL 2024 : ఉప్పల్‌లో సీసీఎల్ మ్యాచ్‌లు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పదో సీజన్ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పదో సీజన్ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక మార్చి 1 నుంచి 3 వరకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి. కాగా.. మ్యాచ్‌లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్ రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ భాషల సినీ తారలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ పోటీలు కావటం వల్ల పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Suresh Raina : రైనా సిక్సర్ల వర్షం.. చూసి ఎన్నాళ్లయిందో..!
టికెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని తెలిపారు.
ఈ సమావేశంలో డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, ఎస్బి ఏసిపి శ్రీధర్ రెడ్డి, మల్కాజిగిరి ఏసిపి పురుషోత్తం రెడ్డి, కుషాయిగూడ ఎసిపి నరేష్ రెడ్డి, ఏసీపీ నరేందర్ గౌడ్, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ఫౌండర్ విష్ణు వర్ధన్ ఇందూరి, బృంద సభ్యులు, తదితర అధికారులు పాల్గొన్నారు.