Champions Trophy 2025: వారిద్దరి కారణంగానే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక ఆలస్యం.. ఎవరా ఇద్దరు?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోపీకి భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఫ్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణంగా తెలుస్తోంది. వారి ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి స్పష్టత వచ్చాకనే జట్టు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

Champions Trophy 2025
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ సైతం విడుదలైంది. అయితే, ఇండియా ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి పాకిస్థాన్, భారత్, దక్షిణాఫ్రికా మినహా మిగిలిన జట్లు తమ టీమ్ లను ప్రకటించాయి. భారత జట్టుసైతం ఈనెల 12నే ఛాంపియన్స్ ట్రోపీకి వెళ్లే జట్టును ప్రకటిస్తుందని అందరూభావించారు. కానీ, ఈనెల 19న జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, జట్టు ప్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణమని బీసీసీఐ వర్గాల సమాచారం.
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఇక ఎప్పటికీ కెప్టెన్ కాలేడా..? కారణం ఏమిటంటే..
ఛాంపియన్స్ ట్రోపీ-2025కు భారత్ జట్టు ఎంపిక విషయంపై గత కొద్దిరోజుల క్రితం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సమావేశమయ్యారు. ఎవరెవరిని ఎంపిక చేయాలనే విషయంపై వీరు చర్చించారు. అయితే, టీమిండియా కీలక బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా, కుల్ దీప్ ఎంపిక విషయంలో వీరిమధ్య చర్చ జరగ్గా.. వీరిద్దరూ జట్టుకు అందుబాటులో ఉంటారా..? లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. దీంతో వారిద్దరి ఫిట్ నెస్ పై స్పష్టత వచ్చాకే జట్టును ఎంపిక చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి గంభీర్, రోహిత్ శర్మ వచ్చినట్లు సమాచారం.
జస్ర్పీత్ బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఆటకు బుమ్రా వెన్ను నొప్పి కారణంగా దూరమైన విషయం తెలిసిందే. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయాలని బీసీసీఐ బుమ్రాకు సూచించింది. అయితే, క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. బుమ్రా ఛాంపియన్స్ ట్రోపీలో గ్రూప్ స్టేజ్ లో జరిగే మ్యాచ్ లలో కాకుండా.. నాకౌట్ దశలో మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడని తెలిసింది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలోకి అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
మరోవైపు టీమిండియా స్పిన్నర్ కుల్ దీప్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. సర్జరీ తరువాత జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ సాధన చేశాడు. అతని ఫిట్నెస్ పై స్పష్టత రావాల్సి ఉంది. జస్ర్పీత్ బుమ్రా భారత్ జట్టుకు కీలకమైన బౌలర్. అదే సమయంలో దుబాయ్ పిచ్ పై కుల్ దీప్ కీలక పాత్ర పోషిస్తాడని బీసీసీఐ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫిట్ నెస్ పై స్పష్టత వచ్చాక జట్టును ప్రకటించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించినట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో వీరి ఫిట్ నెస్ పై సమాచారం తీసుకొని ఈనెల 19 నాటికి ఛాంపియన్స్ ట్రోపీకి టీమిండియా జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది.