ఏషియన్ గేమ్స్‌ 2026లో క్రికెట్‌.. గెట్‌ రెడీ డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇండియా..

గత ఏషియన్ గేమ్స్‌లాగే ఈ సారి కూడా టీ20 ఫార్మాట్‌లోనే క్రికెట్‌ ఆడతారు.

ఏషియన్ గేమ్స్‌ 2026లో క్రికెట్‌.. గెట్‌ రెడీ డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇండియా..

Updated On : April 30, 2025 / 7:38 PM IST

జపాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్‌ కూడా ఉండనుంది. త్వరలోనే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ), గేమ్స్‌ ఆర్గనైజింగ్ కమిటీ (AINAGOC) మధ్య సమావేశాలు జరగనున్నాయి. అనంతరం దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తారు. 20వ ఏషియన్ గేమ్స్‌ వచ్చే ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి.

“ఏషియన్ గేమ్స్‌ 2026లో క్రికెట్‌ను చేర్చే అంశాన్ని ఓసీఏ బోర్డు ఆమోదించాల్సి ఉంది. ఈ ఆమోదం కేవలం ఒక ఫార్మాలిటీ కోసమేనని మేము భావిస్తున్నాం. ఈ బోర్డులో ఆమోద ముద్ర పడ్డాకే ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చుతున్నారన్న అంశాన్ని 100 శాతం నిర్ధారణతో చెప్పవచ్చు” అని జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) అధికారి ఒకరు చెప్పారు.

Also Read: ఇంకా ఫీజు కట్టలేదా? గుడ్‌న్యూస్‌.. ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఏషియన్ గేమ్స్‌లో ఉన్న 41 క్రీడలలో క్రికెట్ ఒకటి. 45 దేశాల నుంచి 15,000 మంది అథ్లెట్లు, అధికారులు ఇందులో పాల్గొంటారు. క్రికెట్‌లో భారత పురుషులు, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్నాయి. గత ఏషియన్ గేమ్స్‌ చైనాలో 2022లో జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాటిని 2023 సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 7 మధ్య నిర్వహించారు.

జపాన్‌లోని నాగోయా సిటీ హాల్‌లో సోమవారం జరిగిన AINAGOC బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 41వ సమావేశంలో క్రికెట్‌తో పాటు మిక్సెడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ రెండింటికీ అధికారికంగా ఆమోదముద్ర పడిందని ఓసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు క్రీడలను ఏషియన్ గేమ్స్‌ 2026లో చేర్చుతున్నట్లు ఓసీఏ బోర్డు నుంచి అధికారికంగా మరో ప్రకటన రావాల్సి ఉంది.

గత ఏషియన్ గేమ్స్‌లాగే ఈ సారి కూడా టీ20 ఫార్మాట్‌లోనే క్రికెట్‌ ఆడతారు. ఈ గేమ్స్‌లో ఎన్ని క్రికెట్ జట్లు పాల్గొనాలన్న విషయంపై త్వరలో జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. చైనాలో 2023లో జరిగిన గేమ్స్‌లో 14 పురుషుల, 9 మహిళల జట్టు పాల్గొన్నాయి.