CSK : ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై తొలిసారి ఇలా..
ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయంతో ముగించింది చెన్నై సూపర్ కింగ్స్.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయంతో ముగించింది చెన్నై సూపర్ కింగ్స్. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాదించింది. సీఎస్‌కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే (52; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (57; 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. ఆయుష్ మాత్రే (17 బంతుల్లో 34 పరుగులు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37 పరుగులు) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. సాయి కిశోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
IPL 2025 : పోతూ.. పోతూ.. ధోని సేన ఎంత పని చేసింది మామ.. నాలుగు టీమ్‌ల భవిష్యత్తే మారిపోయిందిగా..
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (41; 28 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ తలా ఓ వికెట్ సాధించారు.
ఆఖరి స్థానంతో..
ఈ సీజన్‌లో చెన్నైకి ఇది నాలుగో విజయం మాత్రమే కావడం గమనార్హం. 14 మ్యాచ్‌లు ఆడగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో సీజన్‌ను ముగించింది. మరోవైపు రాజస్థాన్ సైతం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలవగా చెన్నై కంటే మెరుగైన రన్‌రేట్ ఉండడంతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
కాగా.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి ఓ సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీఎస్‌కే వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకోకపోవడం కూడా ఇదే తొలిసారి.