Ind vs Aus 2nd ODI : 99 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం..

ఇండోర్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త్‌, ఆసీస్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

Ind vs Aus 2nd ODI : 99 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం..

Ind vs Aus 2nd ODI

భార‌త్ ఘ‌న విజ‌యం..

మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ మూడు వ‌న్డేల మ్యాచ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇండోర్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 99 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 28.2 ఓవ‌ర్ల‌లో 217 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

సీన్ అబాట్.. సిక్స్‌తో అర్థ‌శ‌త‌కం

సీన్ అబాట్ దూకుడుగా ఆడుతున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 29 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. 27 ఓవ‌ర్ల‌లో ఆసీస్ స్కోరు 205/8. సీన్ అబాట్ (51), హేజిల్ వుడ్ (14) ఆడుతున్నారు.

వ‌రుస‌గా వికెట్లు కోల్పోతున్న ఆసీస్‌

భార‌త బౌల‌ర్లు విజృంభిస్తుండ‌డంతో ఆసీస్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ (19) ర‌నౌట్ కాగా.. జ‌డేజా బౌలింగ్‌లో ఆడ‌మ్ జంపా(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 21 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 140/8.

అలెక్స్ కేరీ క్లీన్‌బౌల్డ్‌

ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయిది. జ‌డేజా బౌలింగ్‌లో అలెక్స్ కేరీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 18.2వ ఓవ‌ర్ వ‌ద్ద ఆస్ట్రేలియా 128 ప‌రుగు వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 128/6. సీన్ అబాట్ (0), కామెరూన్ గ్రీన్ (13) లు ఆడుతున్నారు.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన అశ్విన్‌

అశ్విన్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను గ‌ట్టి దెబ్బ కొట్టాడు. 15వ ఓవ‌ర్‌ను వేసిన అశ్విన్ మొద‌టి బంతికి డేవిడ్ వార్న‌ర్ (53; 39 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్‌), ఐదో బంతికి జోష్ ఇంగ్లిస్ (6) ల‌ను ఎల్బీడ‌బ్ల్యూలుగా ఔట్ అయ్యాడు. 15 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 102/5. కామెరూన్ గ్రీన్ (0), అలెక్స్ కేరీ(1) ఆడుతున్నారు.

వార్న‌ర్ అర్థశ‌త‌కం

ఓవైపు వికెట్లు ప‌డుతున్నా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ దూకుడుగా ఆడుతున్నాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

ల‌బుషేన్ క్లీన్‌బౌల్డ్‌

ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌లో ల‌బుషేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12.5వ‌ ఓవ‌ర్‌లో 89 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 90/3. డేవిడ్ వార్న‌ర్ (48), జోష్ ఇంగ్లిస్(1) ఆడుతున్నారు

10 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 63/2.

శార్దూల్ ఠాకూర్ వేసిన ప‌దో ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. ఈ ఓవ‌ర్‌లో డేవిడ్ వార్న‌ర్ ఓ ఫోర్ కొట్టాడు. 10 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 63/2. డేవిడ్ వార్న‌ర్ (31), ల‌బుషేన్ (18) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

కాసేప‌ట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌.. ఆసీస్ ల‌క్ష్యం 33 ఓవ‌ర్ల‌లో317

వ‌రుణుడు తెరిపి నిచ్చాడు. అంపైర్లు మైదానాన్ని ప‌రిశీలించారు. మ‌రికాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. వ‌ర్షం కార‌ణంగా ఓవ‌ర్ల‌ను కుదించారు. డ‌క్ వ‌ర్త్‌లూయిస్ పద్ద‌తి ప్ర‌కారం ఆసీస్ ల‌క్ష్యాన్ని 33 ఓవ‌ర్ల‌లో 317గా నిర్ణ‌యించారు.

మ‌ళ్లీ వ‌చ్చిన వ‌రుణుడు

మ్యాచ్‌కు మ‌రోసారి వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 9 ఓవ‌ర్లు ముగియ‌గానే వ‌ర్షం మొద‌లైంది. దీంతో అంపైర్లు ఆట‌ను నిలిపివేశారు. గ్రౌండ్ మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. అప్ప‌టికి ఆసీస్ స్కోరు 56/2. డేవిడ్ వార్న‌ర్ 26, ల‌బుషేన్ 17 ప‌రుగుల‌తో ఉన్నారు.

వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన ప్ర‌సిద్ధ్ కృష్ణ‌

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే వ‌రుస షాక్‌లు త‌గిలాయి. మొద‌టి ఓవ‌ర్‌ను ష‌మీ వేయ‌గా మాథ్యూ షాట్ రెండు బౌండ‌రీల‌తో తొమ్మిది ప‌రుగులు రాబ‌ట్టాడు. అయితే.. రెండో ఓవ‌ర్‌లో ప్ర‌సిద్ధ కృష్ణ వ‌రుస బంతుల్లో షాట్ (9; 8 బంతుల్లో 2 ఫోర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (0) పెవిలియ‌న్ కు చేర్చాడు. దీంతో ఆసీస్ 9 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 2 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 10/2. డేవిడ్ వార్న‌ర్ (0), ల‌బుషేన్ (1)లు ఆడుతున్నారు.

ఆస్ట్రేలియా టార్గెట్‌ 400

ఇండోర్ లో భార‌త బ్యాట‌ర్లు దంచికొట్టారు. ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ మిన‌హా వ‌చ్చిన ప్ర‌తి బ్యాట‌ర్ ప‌రుగుల వ‌ర‌ద పారించ‌డంతో భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)లు శ‌త‌కాలతో చెల‌రేగ‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ (72నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో విధ్వంసం సృష్టించారు. ఇషాన్ కిష‌న్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడ‌డంతో ఆస్ట్రేలియా ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీయ‌గా, హేజిల్‌వుడ్‌, సీన్ అబాట్‌, ఆడ‌మ్ జంపాలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

సూర్య‌కుమార్ యాద‌వ్ హాప్ సెంచ‌రీ

సీన్ అబాట్ బౌలింగ్‌లో (46.2వ ఓవ‌ర్‌)లో సింగిల్ తీసి 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు సాయంతో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. సూర్య‌కుమార్ ఇది వ‌న్డేల్లో రెండో అర్థ‌శ‌త‌కం. కాగా.. ఈ సిరీస్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచ‌రీలు చేశాడు.

కేఎల్ రాహుల్ అర్థ‌శ‌త‌కం..

సీన్ అబాట్ బౌలింగ్‌లో (44.1వ ఓవ‌ర్‌)లో సింగిల్ తీసి కెప్టెన్ కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

సూర్య‌కుమార్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు సిక్సులు

సూర్య‌కుమార్ యాద‌వ్ ధాటిగా ఆడుతున్నాడు. 44వ ఓవ‌ర్‌ను కామెరూన్ గ్రీన్ వేయ‌గా వ‌రుస‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ నాలుగు సిక్స‌ర్లు కొట్టాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు వ‌చ్చాయి. 44 ఓవ‌ర్ల‌కు భారత స్కోరు 337 4. సూర్య‌కుమార్ యాద‌వ్ (29), కేఎల్ రాహుల్ (49) లు ఆడుతున్నారు.

ఇషాన్ కిష‌న్ ఔట్‌

భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడే క్ర‌మంలో ఇషాన్ కిష‌న్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స‌ర్లు) ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో అలెక్స్ కారీ చేతికి చిక్కాడు. దీంతో భార‌త్ 40.2వ ఓవ‌ర్‌లో 302 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 41ఓవ‌ర్ల‌కు భారత స్కోరు 306/4. సూర్య‌కుమార్ యాద‌వ్ (2), కేఎల్ రాహుల్ (45) లు ఆడుతున్నారు.

శుభ్‌మ‌న్ ఔట్‌

భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడే క్ర‌మంలో శుభ్‌మ‌న్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో అలెక్స్ కారీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 34.5వ ఓవ‌ర్‌లో 243 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 35 ఓవ‌ర్ల‌కు భారత స్కోరు 249/3. ఇషాన్ కిష‌న్ (6), కేఎల్ రాహుల్ (18) లు ఆడుతున్నారు.

శుభ్‌మ‌న్ గిల్ శ‌త‌కం

భార‌త ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ శ‌త‌కంతో స‌త్తాచాటాడు. సీన్ అబాట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 92 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో సెంచ‌రీ పూర్తి చేశాడు. గిల్‌కు ఇది వ‌న్డేల్లో ఆరో శ‌త‌కం కావ‌డం విశేషం. 33 ఓవ‌ర్ల‌కు భారత స్కోరు 230/2. గిల్ (100), కేఎల్ రాహుల్ (9) లు ఆడుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌..

దూకుడుగా ఆడే క్ర‌మంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు.శ‌త‌కం చేసిన మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే సీన్ అబాట్ బౌలింగ్‌లో (30.5వ ఓవ‌ర్‌) శ్రేయ‌స్ అయ్య‌ర్ భారీ షాట్‌కు య‌త్నించగా బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర మాథ్యూ షాట్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 216 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 31 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 216/2. గిల్ (95), కేఎల్ రాహుల్ (0) లు ఆడుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ శ‌త‌కం..

ఎట్ట‌కేల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ ఫామ్ అందుకున్నాడు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత‌ త‌న పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు త‌న బ్యాట్‌తోనే స‌మాధానం చెప్పాడు. ఆసీస్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో జంపా బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచ‌రీ చేశాడు. 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో శ్రేయ‌స్ శ‌త‌కాన్ని అందుకున్నాడు. వ‌న్డేల్లో శ్రేయ‌స్ ఇది మూడో సెంచ‌రీ.

25 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 187/1

ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (85), వ‌న్ డౌన్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (86) లు శ‌త‌కాల‌కు చేరువ అయ్యారు. 25 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 187/1.

శ్రేయ‌స్ అయ్య‌ర్ అర్థ‌శ‌త‌కం

స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో (15.5వ ఓవ‌ర్‌) శ్రేయ‌స్ అయ్య‌ర్ సిక్స్ కొట్టి 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో హాప్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 16 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 128/1. శ్రేయ‌స్ అయ్య‌ర్ (53), శుభ్‌మ‌న్ గిల్ (60) లు క్రీజులో ఉన్నారు.

సిక్స‌ర్‌తో గిల్ హాప్ సెంచ‌రీ

కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో (13.1వ ఓవ‌ర్‌) సిక్స్ కొట్టి 37 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో గిల్ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

మొద‌లైన ఆట‌.. 

వ‌రుణుడు తెరిపినివ్వ‌డంతో మ్యాచ్ మ‌ళ్లీ మొద‌లైంది. మొద‌టి ప‌ది ఓవ‌ర్ల‌లో భార‌త్ వికెట్ న‌ష్టపోయి 80 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్‌(33), శ్రేయ‌స్ అయ్య‌ర్ (34)లు ఆడుతున్నారు.

వ‌ర్షం వ‌ల్ల ఆగిన ఆట‌

భార‌త్ ఇన్నింగ్స్‌లో వేగం పుంజుకుంటున్న త‌రుణంలో వ‌ర్షం మొద‌లైంది. దీంతో అంపైర్లు ఆట‌ను నిలిపివేశారు. ప్లేయ‌ర్ల‌ను గ్రౌండ్‌ను వీడారు. వ‌ర్షం వ‌ల్ల ఆట నిలిచే స‌మ‌యానికి భార‌త్ 9.5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్‌గిల్ (32), శ్రేయ‌స్ అయ్య‌ర్ (34)లు క్రీజులో ఉన్నారు..

దూకుడుగా ఆడుతున్న శ్రేయ‌స్ అయ్య‌ర్‌

భార‌త్ మొద‌టి ప‌ది ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి 75 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్‌గిల్ (26), శ్రేయ‌స్ అయ్య‌ర్‌ (34)లు దూకుడుగా ఆడుతున్నారు.

5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 26/1

భార‌త్ మొద‌టి ఐదు ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 26 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (3), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(10)లు ఆడుతున్నారు.

టీమ్ఇండియాకు భారీ షాక్..

టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (8; 12 బంతుల్లో 2 ఫోర్లు) జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ కారీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 3.4వ ఓవ‌ర్‌లో 16 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

బ్యాటింగ్ ఆరంభించిన భార‌త్‌..

రుతురాజ్ గైక్వాడ్‌, శుభ్‌మ‌న్ గిల్ లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. మొద‌టి ఓవ‌ర్‌ను స్పెన్సర్ జాన్సన్ వేయ‌గా రుతురాజ్ గైక్వాడ్ మొద‌టి బంతినే బౌండ‌రీగా మలిచాడు. మూడో బంతికి ఫోర్ కొట్ట‌గా ఐదో బంతికి వైడ్ ఫోర్‌గా వెళ్ల‌డంతో ఐదు ప‌రుగులు వ‌చ్చాయి. మొత్తం ఈ ఓవ‌ర్‌లో మొత్తం 13 ప‌రుగులు వ‌చ్చాయి. 1 ఓవ‌ర్‌కు భార‌త స్కోరు 13/0. రుతురాజ్ గైక్వాడ్ (8), శుభ్‌మ‌న్ గిల్ (0) లు క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు :

డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ ల‌బుషేన్‌, జోష్ ఇంగ్లీస్, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), కామెరూన్ గ్రీన్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్

భారత తుది జ‌ట్టు :

శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

Ind vs Aus 2nd ODI : ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. తొలి వ‌న్డేలో గెలిచి ఊపుమీదున్న భార‌త్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ చేజించుకోవాల‌ని భావిస్తోంది.