సిరాజ్ భయ్యా అలా చేశావేంటి..! పాపం.. వికెట్ల వద్ద కుప్పకూలిపోయిన బెన్ స్టోక్స్.. ‘వాట్’ అంటూ దగ్గరికెళ్లినా నో రెస్పాన్స్.. వీడియో వైరల్
మూడోరోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ల వద్ద కుప్పకూలిపోయాడు.

Ben Stokes
IND vs ENG 4th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లలో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరుగుతుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ లో 2-1తో వెనుకబడిన భారత్ జట్టు నాల్గో టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్ జట్టుకు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తుంది. కానీ, నాల్గో టెస్టులో ఇంగ్లాండ్ పట్టుబిగించింది. మూడు రోజు (శుక్రవారం) ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 544/7 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో 186 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్ కొనసాగుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
మూడోరోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ల వద్ద కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు నొప్పితో గిలగిల్లాడిపోయాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిరాజ్ ఆందోళనగా ముందుకెళ్తూ ‘వాట్’ అని ప్రశ్నించినా స్టోక్స్ నోటివెంట మాటరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, కొద్దిసేపటి తరువాత నొప్పి తట్టుకోలేక స్టోక్స్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అసలేం జరిగిందంటే..
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 91వ ఓవర్లో సిరాజ్ వేసిన వేగవంతమైన బంతిని స్టోక్స్ డిఫెన్స్ ఆడబోగా.. అది కాస్త ఎక్కువ బౌన్స్ అయ్యి గార్డ్ వేసుకునే చోట బలంగా తాకింది. దీంతో స్టోక్స్ ఒక్కసారిగా నొప్పి భరించలేక వికెట్ల వద్దే కుప్పకూలిపోయాడు. కాసేపు నొప్పితో బాధపడ్డ స్టోక్స్ తరువాత తేరుకొని అలాగే బ్యాటింగ్ కొనసాగించాడు. అప్పటికీ అతను చేసింది 13 పరుగులే. మధ్యలో ఫిజియోతో చికిత్స కూడా తీసుకున్నాడు. ఆ తరువాత నెమ్మదిగా ఆడుతూ ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. నొప్పి ఎక్కువ కావడంతో 116వ ఓవర్లో 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. అయితే, ఏడో వికెట్ పడ్డాక అతను తిరిగి మళ్లీ క్రీజులోకి వచ్చాడు.
Thoughts and prayers for Ben Stokes 😅😅😅 pic.twitter.com/2RiAGkOKLF
— England Cricket (@englandcricket) July 25, 2025
ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లోనూ స్టోక్స్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది లేదు. సిరాజ్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడే సమయంలో తొలిసారి రిటైర్డ్ హర్ట్ గా మైదానం వీడాల్సి వచ్చింది. మరోవైపు.. గత పదేళ్లలో భారత్ ఆడిన విదేశీ టెస్టుల్లో ఓ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 500కుపైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.