Ind Vs Pak : ఆసియా కప్-2022.. పాకిస్తాన్‌పై టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.

Ind Vs Pak : హైఓల్టేజ్ మ్యాచ్.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్. అదే.. భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-ఏలో ఉన్న ఈ రెండు జట్లు కాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, జడేజా, భువనేశ్వర్, అవేష్, అర్ష్‌దీప్, చాహల్.
*రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి కార్తీక్.
పాకిస్తాన్ జట్టు:
రిజ్వాన్, బాబర్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, దహానీ, రవూఫ్, నసీమ్ షా.
ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు ఢీకొంటున్నాయి. కొంతకాలంగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడం కూడా ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తిని పెంచింది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలిసారి టీమిండియా ఐసీసీ టోర్నమెంట్‌లో పాల్గొనబోతుండటం విశేషం. గత టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్, పాక్ జట్లు తలపడుతున్న తొలి మ్యాచ్ ఇదే. అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుని మరోసారి పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని భారత్ కసిగా ఉంది. ఆసియా కప్‌లో భారత్‌దే హవా. అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. గత ఛాంపియన్ కూడా టీమిండియానే.
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన చివరి మూడు మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 2016లో ఒకసారి, 2018లో రెండు సార్లు పాక్ భారత్ ఓడించింది. అయితే 2014లో మాత్రం టీమిండియాపై పాక్ విజయం సాధించింది.
ఈ ఆసియాకప్ టోర్నీలో భారత్-పాక్ మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లూ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. కాబట్టి గ్రూప్ దశలో ఒకసారి తలపడటం ఖాయం. మూడు జట్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కి అర్హత సాధిస్తాయి. అప్పుడు మరొకసారి దాయాదుల పోరు చూడొచ్చు. ఇక ఫైనల్‌కు చేరుకుంటే భారత్-పాక్ మ్యాచ్‌ను ముచ్చటగా మూడోసారి వీక్షించే భాగ్యం ఫ్యాన్స్ కు కలుగుతుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (3,487) మరో పది పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (3,497) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ (367) మరో 66 పరుగులు చేస్తే భారత్-పాక్ మ్యాచుల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధిస్తాడు. పాక్ బ్యాటర్ షోయబ్ మాలిక్ (432) ముందున్నాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన స్కోరర్ కోహ్లీనే. 2012లో (వన్డే ఫార్మాట్) పాక్‌పై 183 పరుగులు చేశాడు.
2016లో (టీ20 ఫార్మాట్) భారత్‌పై పాక్ కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా కప్‌లో టీమిండియాపై పాక్‌కు ఇదే అత్యల్ప స్కోరు. వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై పాక్ 329/6 అత్యధిక స్కోరు సాధించగా.. భారత్ 330/4 చేసి విజయం సాధించింది. భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచుల్లో సయీద్ అజ్మల్ (8), అనిల్ కుంబ్లే (7), అబ్దుల్ రజాక్ (6) వికెట్లు తీశారు.