Gautam Gambhir : ఎవరి పని వారు చేసుకుంటే మంచిది.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్‌పై గంభీర్ ఆగ్రహం..
విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న తరువాత గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
IND vs SA Gautam Gambhir Blasts IPL Team Owner For Split Coaching Suggestion
Gautam Gambhir : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందే ఇదే జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్ అయింది. టెస్టుల్లో వైట్ వాష్ కావడంతో గత కొన్నాళ్లుగా టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ బాల్ కోచ్‌గా అతడి సామర్థ్యాన్ని కొందరు ప్రశ్నించారు. ముఖ్యంగా తొలి టెస్టులో గంభీర్ వల్లే భారత్ ఓడిపోయిందని, అతడిని తొలగించాలని అన్నవారు లేకపోలేదు. ఇప్పుడు వన్డే సిరీస్ గెలవడం గంభీర్‌కు కాస్త ఊరట అనే చెప్పవచ్చు.
శనివారం విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న తరువాత గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్ చేయని విషయాన్ని ఎవరూ మాట్లాడడం లేదన్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మెడ పట్టేయడంతో అతడు మైదానం బయటకు వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
ఆ విషయంపై ఎవ్వరూ మాట్లాడలేదు..
ఫలితాలు మనకు అనుకున్న విధంగా రానప్పుడు బయట ఎన్నో చర్చలు జరుగుతాయని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నాడు గంభీర్. అయితే.. తనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. తొలి టెస్టులో మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ సేవలను తాము కోల్పోయామని, ఈ కారణంగానే తాము ఓడిపోయామని, అయితే.. ఈ విషయాన్ని ఎవరు మాట్లాడలేదని, ఏ మీడియాలోనూ రాయలేదన్నారు.
తనకు మీడియా సమావేశాల్లో సాకులు చెప్పడం రాదన్నాడు. మీరు (విమర్శకులను ఉద్దేశించి) వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయవద్దని దాని అర్థం కాదన్నాడు. టెస్టు జట్టు సంధి దశలో ఉందని, సారథి మ్యాచ్‌కు అందుబాటులో లేనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందన్నాడు.
‘ఎందుకంటే.. గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ మ్యాచ్‌కు ముందు గత ఏడు టెస్టుల్లో అతడు దాదాపు వెయ్యి పరుగులు చేశాడు. అటువంటి ఆటగాడి బ్యాటింగ్ సేవలు కోల్పోయాము. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. అందరూ పిచ్ గురించి మాట్లాడతారు. ఇక క్రికెట్ గురించి పెద్దగా తెలియని వారు సైతం కామెంట్లు చేశారు. ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్ ఏకంగా కోచింగ్ వ్యవస్థనే విభజించాలని మాట్లాడారు. ఎవరైనా సరే వారు వారి పరిధిలో ఉండడం ముఖ్యం.’ అని గౌతీ అన్నాడు.
టీమ్ఇండియా రెండో టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ భారత కోచింగ్ సిబ్బందిపై విమర్శలు చేశాడు. భారత టెస్టు జట్టుకు స్పెషలిస్టు కోచ్ ను నియమించే ఆలోచన చేయాలని అతడు బీసీసీఐకి సూచించాడు. దీనిపైనే గంభీర్ స్పందించినట్లుగా అర్థమవుతోంది.
