IND vs SA : ఆ ఒక్క తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా..ఈ పాటికి.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కామెంట్లు..
విశాఖలో భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు.
IND vs SA Temba Bavuma Comments after india beat South Africa in 3rd ODI
IND vs SA : విశాఖలో భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. మంచి ఆరంభం లభించినప్పటికి కూడా భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయామని చెప్పుకొచ్చాడు. మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి అనంతరం టెంబా బవుమా మాట్లాడాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆడిందని తెలిపాడు. ఫ్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం చాలా సులువు అని అన్నాడు. ఇక తాము ఈ రోజు మ్యాచ్‌ను ఉత్సాహంగా మార్చాలని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే.. బ్యాటింగ్‌లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయామని, అనవసర షాట్లతో వికెట్లను పారేసుకున్నట్లుగా తెలిపాడు. తమ బ్యాటర్లు ఇంకాస్త తెలివిగా బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
తొలి రెండు వన్డేల్లో చాలా బాగా ఆడామని, అయితే.. మూడో వన్డేలో కలిసిరాలేదన్నాడు. ఇక్కడ పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయన్నాడు. ఇక వన్డేల్లో ఆలౌట్ కావాలని ఎవ్వరూ కోరుకోరని చెప్పుకొచ్చాడు. సెంచరీ చేసిన క్వింటన్ డికాక్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా బాగా ఆడాడని అన్నాడు. ఇక తాను కూడా బాగా ఆడినప్పటికి పెద్ద స్కోరు చేయలేదన్నాడు.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. నాణ్యమైన ప్రదర్శన చేసినట్లుగా భావిస్తున్నామన్నాడు. ఈ సిరీస్‌లో ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ టెంబా బవుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ లు చెరో నాలుగు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా. అర్ష్‌దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం యశస్వి జైస్వాల్ (116 నాటౌట్; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ సెంచరీకి తోడు రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (65నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది.
