సొంతగడ్డపై సమరం: తొలి మ్యాచ్ ఎవరి సొంతమో?

  • Published By: vamsi ,Published On : December 15, 2019 / 02:05 AM IST
సొంతగడ్డపై సమరం: తొలి మ్యాచ్ ఎవరి సొంతమో?

Updated On : December 15, 2019 / 2:05 AM IST

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు అంటేనే ఎవరూ ఊహించని ఫలితాలు వస్తుంటాయి. రసవత్తరంగా సాగిన టీ20 పోరులో రెండు మ్యాచ్‌లలో నెగ్గి భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఇప్పుడు వన్డేలతో వినోదం పంచేందుకు రెండు జట్లు సిద్ధం అయ్యాయి. భారత్‌, వెస్టిండీస్‌ జట్లు మూడు వన్డేల సిరీస్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే వెస్టిండీస్‌ వరుస సిరీస్ ఓటములతో ఉన్నప్పటికీ తక్కువ అంచనా వెయ్యకూడదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

వెస్టిండీస్‌పై వరుసగా పదవ వన్డే సిరీస్‌‌లో గెలిచి సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా.. ఈ సారైనా టీమిండియాపై నెగ్గాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. ఇక చెన్నైలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో శనివారం(14 డిసెంబర్ 2019) ప్రాక్టీస్‌ కూడా రద్దు చేసుకుంది. ఆదివారం వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.

టాప్ ఆర్డర్‌లో కోహ్లి, రోహిత్, రాహుల్‌లు మంచి ఫామ్‌లో ఉండగా.. గాయపడిన ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్‌ మంచి ఫామ్‌లో ఉండగా అతనికి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కకపోవచ్చు. ఆందోళన కలిగించిన నాలుగో నంబర్‌ స్థానంలో ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ కుదురుకున్నాడు. ఇక బ్యాటింగ్‌తో  పాటు వికెట్ కీపింగ్‌లోనూ విఫలం అవుతున్న పంత్‌కు ఈ మ్యాచ్‌ పరీక్షే. యువ ఆల్‌రౌండర్‌ దూబె ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. 

బౌలింగ్‌ విషయానికి వస్తే భువనేశ్వర్‌ గాయంతో సిరీస్‌కు దూరం అవగా.. పేస్‌ భారాన్ని మోయాల్సిన బాధ్యత షమి, దీపక్‌ చాహర్‌లపై పడింది. చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలం కాబట్టి స్పెషలిస్టు స్పిన్నర్లుగా చాహల్‌, కుల్‌దీప్‌ ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక వన్డే  ర్యాంకింగ్స్‌లో 122 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్న భారత్‌ ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే ఇంగ్లాండ్‌(125)ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకోవచ్చు.

జట్లు (అంచనా):

భారత్‌: విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌/మయాంక్‌ అగర్వాల్, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, మొహమ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌.

వెస్టిండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), షై హోప్, క్యారీ పియరీ, రోస్టన్‌ చేజ్, రొమారియో షెఫర్డ్, సునీల్‌ ఆంబ్రిస్, నికోలస్‌ పూరన్, హెట్‌మైర్, అల్జారీ జోసెఫ్, వాల్‌ జూనియర్, కీమో పాల్‌.

చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంది. అయితే వర్షం కురిసే అవకాశం లేదు. చెన్నైలో భారత్‌ ఇప్పటివరకు 12 వన్డేలు ఆడగా.. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌ రద్దయ్యింది. ఈ వేదికపై వెస్టిండీస్‌తో భారత్‌ నాలుగుసార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది (2011లో), మరో రెండు మ్యాచ్‌ల్లో (1994, 2007లో) ఓడిపోయింది.