Rohit Sharma : శతక్కొట్టిన రోహిత్ శర్మ.. రెండో వన్డేలో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం..
ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

team india won cuttack odi
ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్ గిల్ (60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా అక్షర్ పటేల్(41 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (44) లు రాణించారు. విరాట్ కోహ్లీ (5) విఫలం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్, గుస్ అట్కిన్సన్ తలా ఓ వికెట్ సాధించారు.
ఓపెనర్ల శుభారంభం..
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం ఇచ్చారు. చాలా కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించాడు.
Rohit Sharma : హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. దాదాపు 16 నెలల తరువాత వన్డేల్లో రోహిత్ శర్మ శతకం..
మరోవైపు గిల్ ఆరంభంలో క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారి కుదురుకున్నాక తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. 45 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగానే ఆడే క్రమంలో జామీ ఓవర్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్ కు గిల్, రోహిత్ శర్మ జోడీ 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ (5) విఫలం అయ్యాడు. అతడిని ఆదిల్ రషీద్ పెవియలిన్‌కు చేర్చాడు.
కోహ్లీ ఔటైన తరువాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో జత కలిసిన హిట్‌మ్యాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 32వ శతకం కావడం విశేషం. సెంచరీ అనంతరం కూడా వేగంగానే ఆడాడు. ఈ క్రమంలో లియామ్ లివింగ్ స్టన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఆదిల్ రషీద్ క్యాచ్ అందుకోవడంతో రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. రోహిత్, అయ్యర్ జోడి మూడో వికెట్ కు 70 పరుగులు నమోదు చేశారు.
మరోవైపు ఫామ్‌ను కొనసాగించిన అయ్యర్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్యా (10)లు విఫలం అయినా కూడా రవీంద్ర జడేజా (11 నాటౌట్)తో కలిసి అక్షర్ పటేల్ మ్యాచ్‌ను ముగించాడు.
అంతక ముందు ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65; 56 బంతుల్లో 10 ఫోర్లు), జోరూట్ (69; 72 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ సాధించారు.
ఇక నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 12న జరగనుంది.