IND vs NZ : న్యూజిలాండ్ పై ఘన విజయం.. అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్..
న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది.

pic credit @ BCCI TWITTER
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ఇండియా అదరగొడుతోంది. ఓటమే ఎరగకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్ సన్ (81; 120 బంతుల్లో 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ విల్ యంగ్ (22) ఫర్వాలేదనిపించగా మిగిలిన వారంతా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ సాధించారు.
లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలో షాక్ తగిలింది. 6 పరుగులే చేసిన రచిన్ రవీంద్ర జట్టు స్కోరు 17 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. వన్‌డన్‌లో వచ్చిన కేఎన్ విలియమ్సన్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
అయితే.. మరో ఎండ్‌లో మాత్రం కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (17), టామ్ లేథమ్ (14), గ్లెన్ ఫిలిప్స్ (12) ఆరంభాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి పెవిలియన్‌కు చేరుకున్నారు. బ్రాస్‌వెల్ (2) సైతం విఫలం అయ్యాడు. ఇక శతకం దిశగా దూసుకువెలుతున్న కేన్‌మామను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేన్ మామను కేఎల్ రాహుల్ స్టంపౌట్ చేశాడు. దీంతో ఏడో వికెట్ గా కేన్ మామ పెవిలియన్‌కు చేరుకున్నాడు. కేన్ విలియమ్సన్ ఔటైన తరువాత కివీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (79; 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
హార్దిక్ పాండ్యా (45; 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (42; 61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీశాడు. కైల్ జామీసన్, విలియం ఒరూర్కే, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర లు తలా ఓ వికెట్ పడగొట్టారు.